Srisailam Devasthanam: మహా శివరాత్రి పర్వదినం ఈ నెల 26 న రాబోతోంది. శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమ్రోగే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే శివాలయాలను ఆయా ఆలయాల కమిటీ సభ్యులు, అధికారులు ముస్తాబు చేస్తున్నారు. అయితే మహా శివరాత్రి రోజు శివాలయాల వద్ద పూజలు నిర్వహించడమే కాక, భక్తులు జాగారం చేస్తారు. అందుకు ప్రసిద్ది చెందిన శైవక్షేత్రాలకు వెళ్లి భక్తులు తమ భక్తిని చాటుకుంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం శైవక్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఇప్పటికే ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైలం క్షేత్రానికి వస్తారన్న అంచనాల మధ్య భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైలానికి వచ్చే భక్తులు పలు సూచనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.
శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు దాదాపు 8 నుండి 10 లక్షల మంది భక్తులు రానున్నట్లు అధికారుల అంచనా. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా భక్తులు అధికసంఖ్యలో శ్రీశైలానికి వస్తారు. అధిక సంఖ్యలో భక్తులు కాలినడకన శ్రీశైల మల్లిఖార్జున స్వామిని దర్శించాలని మొక్కుకుంటారు. అందుకే కాలినడకన శ్రీశైలానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. చుట్టూ నల్లమల అడవుల మధ్య విరాజిల్లుతున్న శ్రీశైల శైవక్షేత్రానికి వచ్చే కాలినడక భక్తులకు అధికారులు పలు సూచనలు జారీ చేశారు.
శ్రీశైలానికి వచ్చే భక్తులు తెల్సుకోవాల్సిన అంశాలు ఇవే..
❄ ఈ నెల 19 నుండి మార్చి ఒకటో తేదీ వరకు అటవీ శాఖ చెక్ పోస్టుల వద్ద 24 గంటలు భక్తులను అనుమతిస్తారు
❄ అటవీ ప్రాంతంలో వచ్చే భక్తులు 2 లేదా 5 లీటర్ల వాటర్ బాటిల్స్ తీసుకు వెళ్ళవచ్చు
❄ ప్లాస్టిక్ నీటి డబ్బాలను ఇష్టారీతిన పడవేయకుండా, చెత్త కుండీలలో వేయాలి
❄ జంతువులకు హాని కలిగించే ఏ పదార్థాలను అడవిలో వేయరాదు
❄ వెంకటాపురం నుండి కైలాస ద్వారం వరకు 46 కిలోమీటర్ల మార్గంలో భక్తుల కోసం అన్ని వసతుల కల్పన
❄ కాలినడకన వచ్చే వారు అస్వస్థతకు గురైతే, వెంటనే విధుల్లో ఉన్న సిబ్బందికి తెలియజేయాలి
❄ అటవీ ప్రాంతంలో అంబులెన్స్ ల సౌకర్యం
❄ అటవీ మార్గంలో 12 ప్రదేశాలలో త్రాగునీరు, భోజన వసతి, వైద్య సదుపాయాలకు అవకాశం
❄ ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా వాహనాలను నిలుపుకోవాలి
❄ అతివేగంతో వాహనాలను నడపరాదు
❄ ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ నిషేధం కాబట్టి ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకు రాకపోవడమే మంచిది
❄ 24, 25, 26,27 నాలుగు రోజులలో క్యూలైన్లలో వచ్చిన భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదం
❄ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఉచితంగా వాహనాలకు అనుమతి
❄ పార్కింగ్ ప్రాంతం నుండి ఉచితంగా మినీ వాహనాల ఏర్పాట్లు
❄ క్యూ లైన్ భక్తులకు పాలు, మంచినీరు, బిస్కెట్లు అల్పాహారం పంపిణీ చేస్తారు
❄ పసిపిల్లలు కలిగిన భక్తులకు పాలు, బిస్కెట్లు
❄ పోలీస్ అధికారులు, సిబ్బంది సూచనలు తప్పక పాటించాలి
Also Read: మహాకుంభమేళాకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి స్పెషల్ వందే భారత్!
11 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు గతం కంటే 30 శాతం మంది భక్తులు అధికసంఖ్యలో వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. శ్రీశైలం వచ్చిన భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం కల్పించే లక్ష్యంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పాతాళగంగ వద్దకు వెళ్లే భక్తులు అక్కడి సిబ్బంది సూచనల మేరకు నడుచుకోవాలని అధికారులు సూచించారు.