WhatsApp profile pic: ఒకప్పుడు వాట్సాప్ ప్రొఫైల్ ఫోటో అంటే ఓ ముచ్చట. మన స్టిల్ ఫోటోను పెట్టుకుంటాం, మనస్తత్వానికి తగినట్టు ప్రొఫైల్ మేజిక్ చూపించాలనుకుంటాం. కానీ.. ఇప్పుడు ఓ మహిళా వాట్సప్ ఫోటోనే ఓ మారణాయుధంలా వాడిన నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఆ దృశ్యాలు చూస్తే గుండె గుభేల్ అనాల్సిందే. వాట్సాప్ ఫోటో ద్వారా చేసే క్షుద్ర పూజల సంగతి తెలిసి గ్రామస్తులే కాదు, ఈ విషయం తెలిసిన వారందరూ షాక్‌కి లోనయ్యారు.
ఎక్కడ జరిగిందంటే?
ఈ భయానక ఘటన ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణం శివపురం సమీపంలో జరిగింది. గ్రామంలోని ప్రధాన రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళ ఫోటో పెట్టి అందరూ చూసేలా క్షుద్ర పూజలు నిర్వహించారు. 4 మేకులు కొట్టి, నిమ్మకాయలు, కోడిగుడ్లు, కొన్ని వస్తువులు చుట్టూ పెట్టి పూర్తిగా భయాందోళన కలిగించేలా ఆ పూజను చేశారు. చూసిన ప్రతి ఒక్కరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇది ఏ సినిమా కాదు, రియల్ లైఫ్‌లో జరిగిన వాస్తవ సంఘటన.
ఈ సంఘటన బాధితురాలు భారతి అనే మహిళ చుట్టూ తిరుగుతోంది. ఆమె మడకశిరలో తన బతుకు తెరువు కోసం చిన్న కిరాణా షాపు నడుపుతోంది. నెత్తిన పడిన బాధల మధ్య తన కుటుంబాన్ని పోషిస్తోంది. అలాంటి ఆమెపై కక్ష పూనిన కొందరు, ఆమె వాట్సప్ ప్రొఫైల్ ఫోటో తీసుకొని కిరాణా షాపు ఎదురుగానే ఈ విధంగా క్షుద్ర పూజలు చేశారు. ఇది పూర్తిగా ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని పోలీసులు భావిస్తున్నారు.
భారతి చెప్పిన వివరాల ప్రకారం.. తనకు వారితో ఎలాంటి సమస్య లేదని, కానీ తన ఫోటోను తీసుకొని ఈ విధంగా పూజలు చేయడం వెనుక నాపై ద్వేషమే ప్రధాన కారణం. ఉదయం షాపు తెరిచే క్రమంలో ఈ దృశ్యం చూసి భయపడ్డానని, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
ఈ విషయం గ్రామంలో తెలియగా. తక్కువ టైమ్‌లో పెద్ద చర్చగా మారింది. ఒకరిని ఇష్టపడకపోతే ఈ రేంజ్‌కు వెళతారా? అనే ప్రశ్నలతో ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి నిర్వాకాలు ఆపకపోతే మానవత్వమే మిగలదని గ్రామస్థుల వాదన.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలు, చుట్టుపక్కలున్న వారి సమాచారం ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. మద్యం సేవించి చేసిన చర్యలేమో, లేక ఒక ఎత్తుగడగా చేశారో అనే కోణాల్లో విచారణ సాగుతోంది.
Also Read: Amaravati towers: ఊహించిందే నిజమైంది.. అమరావతిలో అసలు పని స్టార్ట్.. ఏం జరుగుతుందంటే?
అంతేగాక, గ్రామస్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతంలో, రోడ్డుపై ఇలా పూజలు జరపడం వల్ల భద్రత పరంగా కూడా ఇది ప్రమాదకరమే. చిన్న పిల్లలు, మహిళలు ఈ దృశ్యాలను చూస్తే మానసికంగా ఎంత ప్రభావం పడుతుందో ఊహించుకోలేం. గ్రామ పెద్దలు, సంఘాల ప్రతినిధులు కలసి ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు.
ఈ సంఘటన తర్వాత గ్రామంలోని అనేక మంది మహిళలు తమ వాట్సాప్ ప్రొఫైల్ పిక్ మార్చడం మానేశారు. మరికొందరు ఫోటోను ఎవరు ఎలా వాడతారో? అనే భయంతో తమ డీపీలను హైడ్ చేసేశారు. ఇది సాంకేతిక సమాజంలో ఎదురయ్యే మానసిక హింసకు స్పష్టమైన ఉదాహరణ అని సైకాలజిస్టులు చెబుతున్నారు.
మొత్తంగా చూస్తే.. ఒక మహిళ జీవితంతో ఇలా చెలగాటం ఆటలు ఆడే స్థాయికి మన సమాజం వెళ్లిపోతుందంటే దిగులుగా ఉంది. క్షుద్ర పూజలు చేసి మనుషుల మానసిక స్థిరత్వాన్ని దెబ్బతీయాలనుకునే ప్రయత్నాలు అసహ్యం కలిగించేవి. ఇటువంటి పనులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇకమీదట వాట్సాప్ ప్రొఫైల్ పెడుతున్నారా? సదరు ఫోటో ఎవరికి ఎలా ఉపయోగపడుతుందో తెలియని ఈ కాలంలో, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం ఇది. వాట్సాప్ ఫోటోనే కదా అనుకుంటే.. ఇప్పుడు అదే క్షుద్రానికి వేదిక కావడమంటే ఇదొక భారీ చర్చకు దారి తీసింది.