Amaravati towers: ఎంతకాలంగా ఎదురు చూస్తున్నామో.. ఆ రోజు ఎట్టకేలకు వచ్చేసింది! ఏదో రాజధాని ఉంటుందని, కాగితాల మీదే కదలికలు ఉంటాయని అనుకునే రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు నిజంగానే అమరావతిలో భారీ టవర్‌లు, శాఖల కార్యాలయాలు, పరిపాలనా భవనాలు లాంటి నిర్మాణాలు ప్రారంభంకాబోతున్నాయంటే ఆలోచించడమే గర్వంగా ఉందని అంటున్నారు అమరావతి వాసులు. ఒక్కసారి నిర్మాణాలు మొదలైతే.. అమరావతిలో కనిపించే టవర్స్‌ను చూసి ప్రపంచమే అబ్బురపడాల్సి ఉంటుంది. ఇప్పుడే కేబినెట్ ఆమోదించిన రూ.3673 కోట్ల టెండర్లు, రాబోయే అమరావతికి బలమైన పునాది వేస్తున్నాయి. ఇంతకు ఇప్పుడు అమరావతిలో ఏం జరగబోతోందో తెలుసుకుందాం.
అమరావతి మళ్లీ ఊపందుకుంది. శాసన రాజధానిగా కొనసాగించాలన్న కొత్త ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా, ముఖ్యమంత్రికి తగిన పరిపాలన వేదికలు సిద్దం చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మొత్తం రూ.3673 కోట్ల విలువైన నిర్మాణ టెండర్లకు ఆమోదం తెలిపింది. అమరావతిలో ముఖ్యంగా పరిపాలన సౌకర్యాలను సమకూర్చేందుకు తక్షణమే నిర్మాణాలు ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
అవి నిర్మాణాలు కాదు.. అద్భుతాలు
ఈ టెండర్లలో ముఖ్యంగా మూడు విభాగాల కింద భవనాలు నిర్మించనున్నట్లు సమాచారం. ఇందులో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న GAD టవర్‌కి రూ.882.47 కోట్లు, హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ (HOD) కార్యాలయాల నిర్మాణానికి రూ.1487.11 కోట్లు, అలాగే ఇతర పరిపాలనా భవనాలకు రూ.1303.85 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ మొత్తం రూ.3673 కోట్ల టెండర్లను కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలకు అప్పగించారు. వారు ప్రాజెక్టులపై త్వరలోనే భూమి పూజలు చేసి పనులు ప్రారంభించనున్నారు.
ఈ టవర్ నుండే పరిపాలన..
GAD టవర్ అనేది ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, ముఖ్య కార్యదర్శి కార్యాలయం వంటి కీలక విభాగాల కోసం ప్రత్యేకంగా నిర్మించనున్న ఆధునిక భవనం. ఇది అమరావతిలో పరిపాలనకు కేంద్ర బిందువుగా నిలవనుంది. ఇప్పటివరకు దాదాపు ఏడేళ్లుగా వాయిదా పడుతూ వచ్చిన నిర్మాణం ఇప్పుడు అధికారికంగా మొదలుకాబోతుండటంతో, అమరావతి అభివృద్ధి మార్గంలో ముందడుగు వేసినట్లే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అదే విధంగా హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ కార్యాలయాలు అనేవి దాదాపు 20కు పైగా శాఖల ప్రధాన కార్యాలయాలుగా రూపొందించబడ్డాయి. అందులో రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆరోగ్యం, విద్య, జలవనరులు, వ్యవసాయం తదితర కీలక శాఖల భవనాలు ఉంటాయి. ఇవన్నీ ఒక్క చోటనే ఉండటం వల్ల పరిపాలన వేగవంతం అవుతుంది. ఇప్పటివరకు అధికారులందరూ విశాఖ, విజయవాడ, తెనాలి వంటి ప్రాంతాలనుండి వేరు వేరు కార్యాలయాల నుంచి పని చేస్తున్నారు. కానీ ఇకపై ఒకే భవన సముదాయంలో అన్ని శాఖలూ పనిచేస్తే సమన్వయం మెరుగవుతుంది.
ఇతర పరిపాలనా భవనాల కింద న్యాయ విభాగ భవనాలు, అసెంబ్లీ అనుబంధ కార్యాలయాలు, గెస్ట్ హౌస్‌లు, వర్చువల్ మీటింగ్ హాల్స్ వంటి సదుపాయాలు కూడా నిర్మించనున్నారు. వీటి నిర్మాణం పూర్తయితే రాజధాని రూపు రేఖలు స్పష్టంగా పుటపడతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే 2016లో నిర్మాణాలు ప్రారంభమైన తర్వాత కొన్ని విభాగాల్లో కాంక్రీట్ పనులు 40 శాతం వరకూ పూర్తయినప్పటికీ, గత పాలనలో నిర్మాణాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నిర్మాణాలను పునఃప్రారంభించడం విశేషం.
ప్రభుత్వ నిర్ణయం మేరకు టెండర్లను పారదర్శకంగా నిర్వహించి, అర్హత కలిగిన నిర్మాణ సంస్థలకే కాంట్రాక్టులు అప్పగించారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి ప్రాజెక్టుకూ నిర్దిష్టంగా కాలపట్టిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఏ భవనం ఎప్పటిలోపు పూర్తవాలో ముందే ఫిక్స్ చేసిన షెడ్యూల్ ప్రకారం నడవనున్నాయి. ముఖ్యంగా GAD టవర్ నిర్మాణానికి 18 నెలల గడువు, HOD కార్యాలయాలకు 24 నెలల గడువు, ఇతర భవనాలకు దాదాపు 20 నెలల గడువు ఉండబోతోంది. అప్పటి తర్వాత వీటిని అధికారికంగా ప్రారంభించి వాడుకలోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ టెండర్ల ఆమోదంతో పాటు, అమరావతి ప్రాంతానికి మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వాటర్ సప్లై లైన్‌లు, విద్యుత్ వ్యవస్థ వంటి అంశాలపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగినట్లు సమాచారం. మొదటి దశగా ప్రధాన కార్యాలయ భవనాల నిర్మాణం పూర్తయిన తర్వాత, సెకండరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులకు దారితీయనున్నట్లు తెలుస్తోంది.
ఈ నిర్ణయంతో అమరావతి అభివృద్ధికి వ్యూహాత్మకంగా ఊపు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో మూడు రాజధానుల వ్యవహారంతో అమరావతిలో నిర్మాణాలు అర్థాంతరంగా ఆగిపోయాయి. కానీ ఇప్పుడు నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతికి తిరిగి ప్రాధాన్యం ఇస్తూ చర్యలు తీసుకోవడం, భవన నిర్మాణాల పై నిధుల కేటాయింపులు చేయడం ప్రజల్లో నూతన ఆశలు రేకెత్తిస్తోంది. ప్రత్యేకంగా రైతులు, నిర్మాణ కార్మికులు, రియల్ ఎస్టేట్ రంగంలో నిమగ్నమైనవారికి ఇది పెద్ద ఊరటగా మారనుంది.
మొత్తానికి చూస్తే, ఈ టెండర్లు కేవలం నిర్మాణ ప్రాజెక్టులకే కాదు.. ఒక భవిష్యత్తు రాజధానికి దిశగా వేసిన బలమైన అడుగులుగా కూడా చెప్పవచ్చు. అధికార పరిపాలనకు, ప్రజల సేవకు అమరావతిని మరోసారి సిద్ధం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం.. శాసన రాజధానిగా అమరావతిని పునరుద్ధరించనున్న సంకేతంగా చెప్పవచ్చని స్థానికులు అంటున్నారు.