పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమైందా..? ఎన్నికల ప్రచారం ముగిసే సమయంలో జగన్ సంధించిన 8 ప్రశ్నలు దేనికి సంకేతాలు..? వాస్తవానికి సిపంతీ ఓటుపైనే వైసీపీ ఆశలు పెట్టుకుంది. అయితే కూటమి ప్రభుత్వం అక్కడ గెలుపుకోసం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. నేరుగా మంత్రులే ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. దీంతో వైసీపీకి ఉప ఎన్నికల్లో ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం కష్టంగా మారింది. అయితే జగన్ సొంత నియోజకవర్గంలో ఎన్నిక కావడం, అందులోనూ మూడు దశాబ్దాలుగా ఆ స్థానంలో వైఎస్ఆర్ ఫ్యామిలీ నిలబెట్టిన అభ్యర్థులే గెలుస్తూ రావడంతో.. ఇది వైసీపీ అధినేతకు ప్రతిష్టాత్మకంగా మారింది. కానీ ఇప్పుడు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా లేవని తేలిపోయింది. దీంతో జగన్ ఎన్నికల ముందే అస్త్ర సన్యాయం చేసినట్టు ట్వీట్ వేశారు.
.@ncbn అనే వ్యక్తి ఒక అప్రజాస్వామిక, అరాచక వాదని, రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలుచుకుని రాజకీయాలు చేయరని, కుట్రలు చేసి, దాడులు, దౌర్జన్యాలు చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలుచేసి, వెన్నుపోట్లు పొడిచి కుర్చీని లాక్కోవాలని చూస్తారని అనడానికి మరోమారు మన కళ్లెదుటే… pic.twitter.com/MaZrGo174C
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 10, 2025
జగన్ ట్వీట్..
ఏపీలో రెండు జడ్పీస్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచార పర్వం నేటితో ముగిసింది. ఈ సమయంలో జగన్ ఓ ఆసక్తికర ట్వీట్ వేశారు. సీఎం చంద్రబాబుని అప్రజాస్వామిక, అరాచక వాదిగా పేర్కొన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట ZPTC స్థానాల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తున్నారని విమర్శించారు. సీఎంగా తనకున్న అధికారాన్ని ఆయన దుర్వినియోగం చేస్తున్నారని, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనీయకుండా చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు, వారి అడుగులకు మడుగులొత్తే అధికారులు, వారికి కొమ్ముకాసే కొంతమంది పోలీసులు.. వీరంతా ఓ ముఠాగా ఏర్పడి ఉప ఎన్నికలను హైజాక్ చేయబోతున్నారని చెప్పారు జగన్.
పోలీసులపై ఆరోపణలు..
పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికలకు నోటీఫికేషన్ వచ్చింది మొదలు పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయన్నారు జగన్. వైసీపీ నాయకులను కార్యకర్తలను బైండోవర్ చేశారని, జీవితంలో ఎప్పుడూ పోలీస్‌స్టేషన్ గడపతొక్కని వారిని, ఎలాంటి కేసులు లేనివారిని కూడా బైండోవర్ చేశారని మండిపడ్డారు. వైసీపీ నేతల్ని పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన దాడుల్ని కూడా ప్రస్తావించారు జగన్. వివాహానికి హాజరైన వారిపై కూడా దారి చేశారన్నారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసులు పూర్తిగా ప్రేక్షకపాత్ర వహించారన్నారు. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయాల్సింది పోయి.. వైసీపీ నేతలపైనే తిరిగి తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు జగన్. అధికారపార్టీతో చేతులు కలిపిన అధికారులు, వైసీపీ ఓట్లను తగ్గించేందుకు పోలింగ్ బూత్‌లను ఆ గ్రామాల్లో కాకుండా పక్క గ్రామాలకు మార్చారన్నారు. టీడీపీ ప్రాబల్యం ఉన్న గ్రామాల్లో పోలింగ్ బూత్ లు పెట్టారని, ఆ బూత్ లు క్యాప్చర్ చేయడానికే వారు ప్లాన్ వేశారన్నారు.
చేతులెత్తేసినట్టేనా..?
ఎన్నికలు జరగడానికి ముందే ఇవి ప్రజాస్వామ్య ఎన్నికలు అని జగన్ చెప్పారంటే కచ్చితంగా ఆయనకు ఆశలు ఆవిరై ఉండాలని అంటున్నారు నెటిజన్లు. అయితే చివరగా జగన్ ఓ సెంటిమెంట్ డైలాగుతో ఆ ట్వీట్ ని పూర్తి చేయడం విశేషం. దేవుడిమీద తనకు నమ్మకం ఉందని, ప్రజలపై నమ్మకం ఉందని, అంతిమంగా ధర్మమే గెలుస్తుందని అన్నారు జగన్. ఆ నమ్మకం ఎలా ఉన్నా.. గెలుపుపై మాత్రం జగన్ కి నమ్మకం లేదని, అందుకే ఇలాంటి ట్వీట్ వేశారంటున్నారు నెటిజన్లు.