తెలుగు సినీ రంగ సమస్యలు, ఇటీవల కార్మికుల సమ్మె వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపారు తెలుగు సినిమా నిర్మాతలు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో నిర్మాతల బృందం సమావేశమైంది. సినీరంగ సమస్యల పరిష్కారంకోసం వారు మంత్రికి వినతిపత్రం అందించారు. ఈ సమస్యపై ఇరుపక్షాల అభిప్రాయాలను విని, అనంతరం ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ కు నివేదిస్తానని తెలిపారు మంత్రి దుర్గేష్. ప్రభుత్వ జోక్యం అవసరమైతే, రాష్ట్ర స్థాయిలో తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పూర్తి సహకారం..
ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మాతలకు తెలిపారు మంత్రి కందుల దుర్గేష్. ఏపీలో స్టూడియోలు, రీ-రికార్డింగ్ థియేటర్లు, డబ్బింగ్ థియేటర్లు నిర్మించడానికి ముందుకు వచ్చే వారికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఏపీలో సినీ పరిశ్రమ స్థిరపడాలనేది తమ అభిప్రాయమని ఆయన చెప్పారు. ప్రస్తుతం సమ్మె సమస్య పరిష్కారమవ్వాలంటే.. ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ మధ్య చర్చలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరుగగా అవి విఫలమయ్యాయి. మరోసారి చర్చలు మొదలైతే పరిష్కారం లభించే అవకాశముందని అన్నారు మంత్రి.
#AdminPost
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారితో భేటీ అయిన తెలుగు సినీ నిర్మాతలు. pic.twitter.com/Fclp1JhDKG
— Kandula Durgesh (@kanduladurgesh) August 11, 2025
అసలేం జరిగింది?
మూడేళ్లుగా సినీరంగ కార్మికులకు వేతనాలు పెంచలేదని, ఈసారి పెంచాల్సిందేనంటూ వారు పట్టుబట్టారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. షూటింగ్ లను బహిష్కరించారు. కనీసం 30శాతం వేతనాలు పెంచాలన్నారు. మధ్యే మార్గంగా ఈ ఏడాది 20శాతం, మరుసటి ఏడాది 10శాతం అయినా పెంచాలన్నారు. కానీ నిర్మాతలు ఈ ప్రపోజల్ కి ససేమిరా అంటున్నారు. పక్క రాష్ట్రం నుంచి కార్మికులను పిలిపించుకుని షూటింగ్ లు పూర్తి చేస్తామని కొందరు స్పష్టం చేశారు. దీంతో చర్చలు విఫలమయ్యాయి. కార్మికులు జీతాల పెంపుకోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ దశలో నిర్మాతలు ప్రభుత్వ జోక్యం కోరుతున్నారు. అటు తెలంగాణలో, ఇటు ఏపీలో సినిమాటోగ్రఫీ మంత్రులతో నిర్మాతలు వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వ సాయం కావాలన్నారు.
ఏపీలో మంత్రి కందుల దుర్గేషన్ ని కలసిన నిర్మాతలు, వచ్చే నెలలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అపాయింట్‌మెంట్ కావాలని కోరారు. ఆమేరకు సీఎం, డిప్యూటీ సీఎంతో నిర్మాతలు సమావేశమయ్యేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు మంత్రి దుర్గేష్. అదే సమయంలో ఏపీలో ఉన్న టాలెంట్‌ను ఉపయోగించుకోవాలని ఆయన నిర్మాతలను కోరారు. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక పాలసీ ఉండాలని చెప్పారు. సినీ పరిశ్రమ అభివృద్ధికోసం ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారాయన.
పరిష్కారం ఏంటి..?
జీతాలు పెంచాల్సిందేనంటున్నారు కార్మికులు. ఇప్పుడున్న జీతాలే ఎక్కువ అనేలా మాట్లాడుతున్నారు నిర్మాతలు. ఓ దశలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. కార్మికుల్లో చాలామందికి స్కిల్స్ లేవని, కేవలం యూనియన్ కార్డులతో నెట్టుకొస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపించాయి. దీంతో వారంతా నిర్మాతలపై మండిపడ్డారు. జీతాలు పెంచే వరకు షూటింగ్ లకు హాజరయ్యేది లేదని తెగేసి చెప్పారు. జీతాల పెంపులో నిర్మాతలు ఇచ్చిన ప్రతిపాదనను వారు అంగీకరించడం లేదు. విడతల వారీగా పెంపు అంటే తాము మోసపోతామని వారు అంటున్నారు. కార్మికుల సంఘాలను కూడా విడదీసే ప్రయత్నం జరుగుతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.