Aadudam Andhra Scam: వైసీపీ ఫైర్ బ్రాండ్‌కి కొత్త టెన్షన్ పట్టుకుందా? మాజీ మంత్రి రోజా అరెస్టుకు రంగం సిద్ధమైందా? ‘ఆడుదాం-ఆంధ్రా’ ఈవెంట్ లో అవినీతి జరిగినట్టు విజిలెన్స్ రిపోర్టు తేల్చిందా? అసెంబ్లీలో చర్చించిన తర్వాత విచారణకు ఆదేశిస్తుందా? కేబినెట్‌లో చర్చించిన తర్వాత విచారణకు ఆదేశిస్తుందా? ఇదే చర్చ ఏపీ అంతటా మొదలైంది.
వైసీపీ హయాంలో ఘనంగా ‘ఆడుదాం ఆంధ్రా’ ఈవెంట్ జరిగింది. ఇందులో నిధులు దుర్వినియోగంపై కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లువెత్తాయి. దీనిపై దర్యాప్తు చేసిన విజిలెన్స్-ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు ప్రాథమిక నివేదికను రెడీ చేశాయి. ప్రస్తుతం డీజీపీ పరిశీలనలో ఉంది. దీని తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది.
క్రీడా పరికరాల కొనుగోళ్ల మొదలు ఈవెంట్ ముగిసే వరకు ప్రతీ అంశంలో అవినీతి జరిగినట్టు విజిలెన్స్ రిపోర్టులో తేలినట్టు సమాచారం. ఈ రిపోర్టును ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించిన తర్వాత విచారణకు ఆదేశిస్తుందా? కేబినెట్‌లో చర్చించి విచారణకు ఆదేశిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఏది జరిగినా వైసీపీలో క్రీడల మంత్రి రోజా, శాఫ్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అదుపులోకి తీసుకుని విచారించడం ఖాయమనేది అధికార పార్టీ నుంచి సంకేతాలు బలంగా వస్తున్నాయి. రిపోర్టు విషయం తెలియగానే రోజాకు టెన్షన్ పట్టుకున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా అరెస్టు చేస్తారని మద్దతుదారుల వద్ద వాపోయారట. ఈ క్రమంలో ముందస్తు బెయిల్‌కు ఆమె ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ALSO READ: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు?
‘ఆడుదాం ఆంధ్రా’ ఈవెంట్‌లో రూ.119 కోట్లలో భారీగా అక్రమాలు జరిగాయన్నది ప్రధాన అభియోగం. రూ.37.50 కోట్లతో క్రీడా పరికాల కొనుగోళ్లలో కమీషన్ల వ్యవహారం నడిచినట్లు ఆరోపణలు లేకపోలేదు. ఢిల్లీ, యూపీ, బెంగళూరు సహా మొత్తం ఆరు సంస్థల నుంచే క్రీడా సామాగ్రి కొనుగోలు చేశారు. దీనికి రోడ్లు-భవనాల శాఖ ద్వారా టెండర్లు పిలిచి సరఫరా సంస్థలను ఎంపిక చేశారు.
అయితే నాసిరకం సామాగ్రి కారణంగా వాటి నాణ్యతపై అప్పట్లో అనుమానాలు మొదలయ్యాయి. టెండర్ల మాట పక్కనబెడితే.. క్రీడాకారులను ఎంపిక చేసిన విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వాలంటీర్లను పెట్టి ఆడించారనే అపవాదు లేకపోలేదు. పోటీల నిర్వహణకు దాదాపు రూ.15 కోట్లు ఖర్చుగా చూపారట.
విజేతలకు నగదు కేటాయింపులోనూ భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయట. ఈ విషయం సమాచార హక్కు చట్టం కింద బయటకు వచ్చింది. టీ షర్టుల కొనుగోళ్లలో అక్రమాలు ఉన్నాయట. నాసిరకం టీ షర్టులను కొనుగోలు చేసిన కొందరు కమీషన్లు జేబుల్లో వేసుకున్నారు. శాప్‌లో కొందరు అధికారులు కీలకంగా మారినట్టు తేలింది. ఈవెంట్ ముగింపు విశాఖలో జరిగింది.
దీనికోసం రూ.2.70 కోట్లకుపైగా ఖర్చు చేసినట్టు అనుమానాలు మొదలయ్యాయి. టిడ్కో ఇళ్లలో ఆటగాళ్లకు వసతి కల్పించి దానిపేరిట ఏకంగా రూ.45 లక్షలు కేటాయించినట్టు చూపారు. భోజనాలకు రూ.65.51 లక్షలు, వీఐపీల కోసం రూ.30 లక్షలు, మైదానాలు ఏర్పాట్లు, ఫొటో-వీడియోగ్రఫీకి రూ.36 లక్షలు ఖర్చు చేసినట్లు చూపించారు. అవినీతి జరిగినట్టు దాదాపు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం.