Botsa Satyanarayana: చీపురుపల్లి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తన భవిష్యత్ ఎన్నికల ప్రణాళికపై పూర్తి స్పష్టత ఇచ్చారు. శుక్రవారం గరివిడిలోని పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే తాను ప్రత్యక్ష పోటీలో ఉంటానని ఆయన తేల్చి చెప్పారు.
వదంతులకు చెక్.. పోటీపై స్పష్టత
తన ఆరోగ్యం సహకరించడం లేదని, పోటీకి దూరంగా ఉండి రాజ్యసభకు వెళ్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని బొత్స తీవ్రంగా ఖండించారు. తన పిల్లలు పోటీ చేస్తారనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. పార్టీ పట్ల, కార్యకర్తల పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుకుంటూ.. కార్యకర్తల అభిమానాన్ని చూసి ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
పార్టీ మార్పుపై ఘాటు వ్యాఖ్యలు
వైకాపాను వీడి తెదేపాలో చేరిన తన బంధువు చిన్న శ్రీను పేరు ఎత్తకుండానే బొత్స పరోక్షంగా చురకలు అంటించారు. ‘మా మధ్య ఉన్న ఒక సంధానకర్త వెళ్లినంత మాత్రాన పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు. పదవులను అడ్డుపెట్టుకుని భూదందాలు, ఆర్థిక ప్రయోజనాలు పొందిన వారే ఈ రోజు పార్టీని వీడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. ఇకపై తన పిల్లలు అనూష, సందీప్‌లతో పాటు స్థానిక నేతలే తనకు సంధానకర్తలుగా ఉంటారన్నారు.
భీమిలి బాధ్యతల్లో బొత్స అనూష
మరోవైపు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ వైకాపా సమన్వయకర్తగా బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూషను వైకాపా అధినేత జగన్ నియమించారు. చిన్న శ్రీను పార్టీకి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఈ స్థానంలో అనూషను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మొదట జిల్లా పరిషత్ ఛైర్మన్ రేసులో ఉంటారని భావించినప్పటికీ, అనూహ్యంగా ఆమెను భీమిలి ఇన్ ఛార్జ్‌గా నియమించడం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో మాజీ ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, బొత్స ఝాన్సీలక్ష్మి, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Also Read: ఢిల్లీలో గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ సమిట్.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!