Anakapalli Love: అసలు ఈ లోకానికి ఏమైంది. ప్రేమకు కులం, ఆస్తులే కాదు వరుసలు కూడా అడ్డురావు అంటున్నారు. పాఠ్యా పుస్తకాలు చదవాల్సిన పసిహృదయాలు ప్రేమ పాఠాలు భట్టిపడుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో ఇలాంటి రెండు ప్రేమ కథలు కన్నీళ్లను మిగిల్చివెళ్లాయి. పెద్దలు కాదన్నారని తనువులు త్యాగం చేసి ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు.
ఈ పిచ్చి ప్రేమలు మానుకోండి అంటూ వార్నింగ్..
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పెద్దమదినకు చెందిన ఇంటర్ విద్యార్థిని, హోటల్‌లో పనిచేసే కనకరాజు గాఢంగా ప్రేమించుకున్నారు. తీరా ఆరా తీస్తే ఆ ఇద్దరూ దూరపు చుట్టాలట. వరుసకు అన్నాచెల్లెళ్లు.. దీంతో పెద్దలు తీవ్రంగా మందలించారు. ఈ బంధం కుదరదు.. ఈ పిచ్చి ప్రేమలు మానుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ యువతీయువకులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ప్రేమించిన వాళ్లతో కలిసి బతకలేమనే భయమో, లేక సమాజం ఏమనుకుంటుందనే బెంగో కానీ.. క్షణికావేశంలో ఊహించని నిర్ణయం తీసుకుని ప్రాణాలు వదిలేశారు.
Also Read: ఇంట్లోనే 30 ఏళ్లుగా పెరుగుతున్న పుట్ట.. భయంతో వణుకుతున్న వృద్ధురాలు!
మరో దారుణం వెలుగులోకి ..
ఈ గుండె కోత మరవకముందే.. పక్కనే ఉన్న కే. కోటపాడు మండలం కింతాడలో మరో దారుణం వెలుగు చూసింది. పెళ్లి చేసుకుని ఒక్కటవుదామనుకున్న మరో మైనర్ ప్రేమజంట చావు నీడను ఆశ్రయించింది. ఇద్దరూ మైనర్లు కావడంతో ప్రేమగీమా జాన్తా నహీ ముందు బాగా చదువుకోండి అంటూ పెద్దలు తిట్టిపంపించారు. తమ ప్రేమను ఇంట్లో ఒప్పుకోలేదన్న బాధ ఆ పసిమనసులను కుంగదీసింది. ఇక బతకలేమన్న నిరాశతో ఆ మైనర్ జంట నేరుగా వెళ్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే చావుకు ముందు ఆ బాలుడు తన తండ్రికి ఫోన్ చేసి.. నాన్న మేము వెళ్లిపోతున్నామంటూ ఏడుస్తూ..ఇన్‌ఫర్‌మేషన్ ఇచ్చాడు. ఆ మాట విన్న తండ్రి గుండె పగిలిపోయి అక్కడికి పరుగెత్తుకు వచ్చేసరికి.. జరగరాని అనర్థం జరిగిపోయింది. ఈ రెండు ఘటనల్లో ఒకరిది పిచ్చితనం.. మరొకరిది పసితనం. బోలెడంత భవిష్యత్‌ను కళ్లముందు ప్రేమ కోసం కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చివెళ్లారు.