Botsa Satyanarayana: ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేతికి వచ్చే కీలక సమయంలోనే ప్రకృతి విపత్తులు సంభవించి రైతులు తీవ్రంగా నష్టపోయారని, అలాంటి వేళ వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదని, గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకైనా ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించలేకపోయిందని ఆరోపించారు.
మొక్కజొన్న రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని బొత్స పేర్కొన్నారు. గతంలో క్వింటా ధర 2300 రూపాయల వరకు ఉన్న మొక్కజొన్న ధర ప్రస్తుతం 1500 రూపాయలకు పడిపోయిందని, ఈ పరిస్థితిపై ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రైతుల సమస్యలు ఇంత తీవ్రంగా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయాల్సిన అవసరం లేదా అంటూ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని నిలదీశారు. రైతు సంక్షేమం అన్న మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయని విమర్శించారు.
ప్రభుత్వ దృష్టి రైతులపై కాకుండా విశాఖపట్నం భూములపై ఉందని బొత్స ఆరోపించారు. కోట్లాది రూపాయల విలువైన భూములను 99 పైసలకే కొందరికి కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపణ చేశారు. రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు కేటాయించే సమయంలో ఎందుకు పారదర్శకత పాటించడం లేదని ప్రశ్నించారు. భూములను నేరుగా కేటాయించకుండా వేలం ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూముల పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ దోపిడీకి విశాఖ అడ్డాగా మారింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం వైఎస్ జగన్ పథకాలకు పేర్లు మార్చి పబ్బం గడుపుతోందని బొత్స విమర్శించారు. ప్రజలకు మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వం కేవలం పేరు మార్చే రాజకీయంతో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటోందని ఆరోపించారు. గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్య, వైద్యం వంటి మౌలిక అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని అన్నారు. రామ జపంలా, వైసీపీ జపం, జగన్ జపం మానండి అంటూ ప్రభుత్వాన్ని వ్యంగ్యంగా విమర్శించారు.
అమరావతికి భూసేకరణ విషయంలోనూ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని బొత్స ఆరోపించారు. గతంలో భూములు ఇచ్చిన రైతుల సమస్యలే ఇంకా పరిష్కారం కాకముందే మళ్లీ భూసేకరణ అంటున్నారని అన్నారు. రైతుల విధానమే తమ విధానమని స్పష్టం చేశారు. బోగాపురం ఎయిర్‌పోర్ట్ విషయంలోనూ కీలక వ్యాఖ్యలు చేశారు. బోగాపురం ఎయిర్‌పోర్ట్ అనేది వైఎస్సార్‌సీపీ ఘనతగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని, కానీ వైఎస్ జగన్ తండ్రి హయాంలోనే బోగాపురం ఎయిర్‌పోర్ట్ ఆలోచన వచ్చిందని గుర్తు చేశారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఎందుకు భూసేకరణ పూర్తి చేయలేకపోయారో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నేను చెప్పింది తప్పైతే తలదించుకుంటాను అంటూ సవాల్ విసిరారు.
విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ పై ప్రభుత్వానికి సరైన పర్యవేక్షణ లేదని కూడా బొత్స విమర్శించారు. లులు వంటి పనికిమాలిన సంస్థలకు భూములు కేటాయించారని ఆరోపించారు. లులు గ్రూప్ కు ఇచ్చిన భూములు, ఇనార్బిట్ మాల్‌కు ఇచ్చిన భూములకు ఏమాత్రం పోలిక లేదని, అయినా ఒకే విధమైన నిర్ణయాలతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు.
Also Read: లిక్కర్ స్కామ్‌లో తవ్వేకొద్దీ అక్రమాలు.. ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి అక్రమాలు వెలుగులోకి!
సిరిమానూ జాతర సందర్భంగా తన భద్రత విషయంలో.. ప్రభుత్వం తీవ్ర అలసత్వం వహించిందని బొత్స సంచలన ఆరోపణ చేశారు. వేదిక కూలడం వెనుక స్పష్టమైన నిర్లక్ష్యం కనిపిస్తుందని, కుట్ర కోణం ఏమైనా ఉందా అనే అనుమానం కూడా నెలకొన్నందుకే గవర్నర్‌కు లేఖ రాసినట్లు వెల్లడించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శాసన మండలి ప్రతిపక్ష నేతకు అవమానం జరిగిందని, మాక్ అసెంబ్లీ సందర్భంగా తనకు ఆహ్వానం ఇవ్వకపోవడం కూడా ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని చెప్పారు. ఇదే అంశంపై సీఎం చంద్రబాబుకు, స్పీకర్‌కు కూడా లేఖ రాసినట్లు తెలిపారు.