Buddha Venkanna: విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) జన్మదిన వేడుకలు అమరావతి పరిధిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి, ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అభిమానులు, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) శ్రేణులు పాల్గొని సందడి చేశారు.
ఈ వేడుకల అనంతరం బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ జగన్
జగన్ మోహన్ రెడ్డి పాలన అరాచకానికి పేటెంట్ హక్కులా మారిందని బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఒక దళిత వ్యక్తి అయిన గురునాథ్‌పై దాడికి పాల్పడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అంత తీవ్రమైన దాడి జరిగినా పోలీసులు కనీసం కేసు నమోదు చేయకపోవడం దారుణమని, పైగా ఆ ఎమ్మెల్యేకు వైఎస్సార్‌సీపీ మద్దతుగా నిలవడం వారి అరాచక వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.
సంక్షేమానికి చంద్రబాబు.. అరాచకానికి జగన్
తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొంటూ.. ‘సంక్షేమం అంటే చంద్రబాబు, అరాచకం అంటే జగన్’ అని బుద్ధా వెంకన్న తెలిపారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కేసులకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేశారని ఆరోపించారు. బీసీ యువకుడిపై దాడి జరిగినప్పుడు పరామర్శించడానికి వెళ్లని జగన్, అసలైన బీసీ ద్రోహి అని ధ్వజమెత్తారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి కనీస అవగాహన లేకుండా మాట్లాడటం శోచనీయమన్నారు.
డీఎస్సీపై లోకేష్ సవాల్.. జగన్ పారిపోతున్నారు!
గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో లక్షలాది మంది నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూసి నిరాశకు గురయ్యారని గుర్తుచేశారు. జగన్ చేయలేని పనిని మంత్రి నారా లోకేష్ బాధ్యతగా పూర్తి చేస్తున్నారని ప్రశంసించారు. డీఎస్సీపై బహిరంగ చర్చకు సిద్ధమని లోకేష్ సవాల్ విసురుతుంటే, జగన్ మాత్రం తప్పించుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో పోలీసు వ్యవస్థను నీరుగార్చి, తప్పుడు కేసులు పెట్టిన జగన్, ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంటే మతిభ్రమించి మాట్లాడుతున్నారని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు.
Also Read: గ్యాస్ పేలి తండ్రితో పాటు ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలు.. కాపాడిన 108 సిబ్బంది!