UPI payment limit at petrol pumps| ఇకపై పెట్రోల్ బంక్‌కు వెళ్లే ముందు మీ ఫోన్‌లో యుపిఐ ఉంటే సరిపోతుందని అనుకోవడం మీరు చేసే పెద్ద పొరపాటు కావొచ్చు. రూ.2,000 దాటిన ఇంధన బిల్లులకు యుపిఐ చెల్లింపులపై కొత్త MDR నిబంధనలు రావడంతో వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌సిఆర్ ప్రాంతంలో కొన్ని పెట్రోల్, CNG బంకుల్లో ఇప్పటికే ‘No UPI, Only Cash’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇదే సమయంలో మధ్యప్రదేశ్‌లోని పెట్రోల్ బంక్ డీలర్లు రూ.2,000కు పైబడిన యుపిఐ పేమెంట్స్ నిలిపివేయాలని నిర్ణయించారు.
మధ్యప్రదేశ్‌లో పెట్రోల్ బంక్ డీలర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 16 నుంచి రూ.2,000కు పైబడిన ఇంధన బిల్లులకు (పెట్రోల్, డీజిల్) యుపిఐ చెల్లింపులు తీసుకోకూడదని నిర్ణయించారు.
రాష్ట్రంలో సుమారు 4,700 పెట్రోల్ బంకులు ఉన్నాయని డీలర్ల సంఘం తెలిపింది. రూ.2,000 వరకు పేమెంట్ చేయడానికి యుపిఐ స్వీకరిస్తారు. అంతకంటే ఎక్కువ బిల్లులకు వినియోగదారులు నగదు లేదా ఇతర చెల్లింపు మార్గాలను ఉపయోగించాల్సి రావచ్చు.
కొత్త యుపిఐ MDR విధానం అక్టోబర్ 15, 2026 నుంచి అమల్లోకి రానుంది. సాధారణంగా రూ.2,000కు పైబడిన అర్హత కలిగిన వ్యాపారి చెల్లింపులపై 0.4 శాతం MDR ఉంటుంది. అయితే ఇంధన చెల్లింపులకు ప్రత్యేకంగా రూ.5 ఫ్లాట్ MDR వర్తిస్తుంది. అయితే వ్యాపారపరంగా కాకుండా పర్సన్ టు పర్సన్ చేసే యుపిఐ చెల్లింపులు ఈ మార్పుతో ప్రభావితం కావు. రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ సాధారణ లావాదేవీలకు MDR గరిష్ఠంగా రూ.300గా ఉంటుంది.
ఢిల్లీలోని కొన్ని పెట్రోల్, CNG పంప్స్‌లో బంకుల్లో నగదు లేదా కార్డుతో చెల్లించాలని బోర్డులు పెట్టినట్లు నివేదికలు వచ్చాయి. గ్రేటర్ నోయిడాలోని ఒక CNG బంక్‌లో కూడా ‘నో యుపిఐ క్యాష్ ఓన్లీ’ పోస్టర్ కనిపించింది. అక్కడ సిబ్బంది యుపిఐ చెల్లింపును స్వీకరించలేదని ఒక వైరల్ వీడియోలో కనిపించింది. అయితే తర్వాత బంక్ ఉద్యోగి ఆన్‌లైన్ పేమెంట్ మెషిన్ మూడు రోజులుగా పనిచేయడం లేదని తెలిపారు.
Also Read: ‘రూ.11 సెలైన్ బాటిల్ రూ.325 ధరకు విక్రయం.. ఆస్పత్రిలో ప్రజలను దోచుకుంటున్నారు’
పెట్రోల్ బంక్ డీలర్లు తమ లాభాలపై MDR అదనపు భారం పెంచుతుందని చెబుతున్నారు. అందుకే రూ.2,000కు పైబడిన యుపిఐ చెల్లింపులను నిలిపివేయాలని కొన్ని సంఘాలు హెచ్చరించాయి.
ఢిల్లీ వ్యాపార సంఘాలు కూడా MDRపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ నేతలు యుపిఐపై అదనపు ఖర్చు వ్యాపారులపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
Also Read: నెలకు రూ.1 లక్ష సాలరీ.. సాఫ్ట్‌వేర్ జాబ్ కాదని చిన్న బిజినెస్.. నేడు రూ.9 కోట్ల టర్నోవర్
ప్రభుత్వం MDR ఖర్చును నేరుగా వినియోగదారుల నుంచి వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. అయితే పెట్రోల్ బంకులు, వ్యాపార సంఘాలు ఈ మార్పుపై ఆందోళన కొనసాగిస్తున్నాయి.