AP Free Bus Scheme: ఏపీ సీఎం చంద్రబాబు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని ప్రారంభిస్తామని ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత మహిళలు ఫుల్ హ్యాపీ. కాకపోతే ఉచిత బస్సులు సదుపాయం కేవలం జిల్లాలకే పరిమితమవుతుందా? లేక రాష్ట్రవ్యాప్తంగా వర్తింప చేస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
గత అసెంబ్లీ సమావేశాల్లో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం గురించి మండలిలో చర్చ జరిగింది. ఆ సమయంలో వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈలోగా అధికార పార్టీ సభ్యులు జోక్యం చేసుకుని కొన్ని విషయాలు బయటపెట్టారు. ఎన్నికల హామీల్లో ఉచిత బస్సు పథకం స్కీమ్ పెడతామని చెప్పామన్నారు. అది ఆ జిల్లాలకు పరిమితమా? రాష్ట్రమంతా తిరగవచ్చా? ఇంకా విధి విధానాలు ఖరారు కాలేదని చెప్పారు.
ఉచిత బస్సు స్కీమ్ ఎలా అమలు చేస్తున్నారో తెలుసుకునేందుకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో పర్యటించారు ఏపీ అధికారులు. కర్ణాటక, తమిళనాడుల్లో పల్లెలు, పట్టణాలకు ఈ సదుపాయం కల్పించారని తేల్చారు. తెలంగాణ వ్యాప్తంగా ఉచిత బస్సు సదుపాయం అమల్లో ఉందన్నారు. కాకపోతే మహిళలకు ప్రత్యేకంగా బస్సులు వేస్తే బాగుంటుందని, లేకుంటే సీట్ల విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారట అధికారులు.
తాజాగా నాలుగు కిందట సీఎం చంద్రబాబు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. పక్కనే ఉన్న తెలంగాణ.. జిల్లాలతో సంబంధం లేకుండా ఉచితంగా మహిళలు ప్రయాణిస్తున్నారు. అలాంటప్పుడు ఏపీలో జిల్లాల లిమిట్స్ పెడితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని భావిస్తున్నారట. అందుకే దీనిపై లోతుగా ఆలోచిస్తున్నారట సీఎం చంద్రబాబు.
ALSO READ: 300 ఏళ్ల తర్వాత శ్రీవారికి అఖండాల విరాళం
ఆర్టీసీ అధికారులతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రమంతా వర్తింపజేస్తే ప్రభుత్వంపై ఏడాదికి రూ.3,182 కోట్ల భారం పడుతుందని ఓ అంచనా. నెలకు దాదాపుగా రూ.265 కోట్లు అన్నమాట. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి నెలకు రూ.400 కోట్ల వరకు భారం పడుతోంది. అయినా విజయవంతంగా ఈ పథకాన్ని అమలుచేస్తోంది.
ఏపీలో మహిళలు స్వేచ్ఛగా ప్రయాణించేలా ఉండాలని ఆలోచన చేస్తున్నారట ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ పథకం అమలపై అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారట. ఈ పథకం వల్ల భారం పడినా ఇతర మార్గాల్లో ఆదాయాన్ని సమకూర్చుకునే ప్లాన్ ఆలోచించాలని సలహా ఇచ్చారట.
ఏపీలో ప్రతీ బస్సుకు 69 శాతం మంది ప్రయాణికులు ఉంటున్నారు. 35 సీట్లు ఉండే బస్సులో 23 మంది ప్రయాణికులు ఉంటున్నారు. డీజిల్ ఇతరత్రా ఖర్చులు తగ్గవు. అందుకు బదులుగా బస్సుల్లో ఆక్యుపెన్సీ రేటు 94 శాతం వరకు పెరిగితే ఆర్టీసీకి లాభం వస్తుందని భావిస్తున్నారట.
ఆర్టీసీకి ఆదాయం పెంచేందుకు బస్సు స్టేషన్లలో సౌకర్యాలు మెరుగుపరచనున్నారు. వాటితోపాటు షాపింగ్ మాళ్లను పెంచుతారు. పార్కింగ్ ఇతరత్రా సౌకర్యాల ద్వారా ఆర్టీసీకి ఆదాయం పెరుగుతుందని అధికారుల అంచనా. బస్సులో మహిళల సంఖ్య పెరిగినా, పెరగకపోయినా డీజిల్ ఖర్చులు కంటిన్యూ అవుతుందని దానివల్ల పెద్దగా నష్టం ఉండదని భావిస్తున్నారు. ఆయా అంశాలపై నివేదిక రెడీ చేసి రేపో మాపో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు అధికారులు. మొత్తానికి ఉచిత బస్సు సౌకర్యాన్ని పక్కాగా అమలు చేయాలని ఆలోచన చేస్తోంది చంద్రబాబు సర్కార్.