ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారం పొలిటికల్ హీట్ ను పెంచింది. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని కొంతకాలంగా టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఈనెల 28న హస్తినకు వెళ్లనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.
ఓట్ల జాబితా రూపకల్పనలో ప్రతి ఊరులోనూ అక్రమాలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. తాజాగా ఉరవకొండలో జరిగిన ఘటనలు ప్రస్తావించారు. సీఈసీ దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లాలని భావిస్తున్నారు. వైసీపీ సానుభూతిపరులు దొంగ ఓట్లు చేర్చతున్నారని చంద్రబాబు విమర్శించారు. అలాగే టీడీపీ అనుకూల ఓట్లు తొలగించడంపై చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. ఓటర్ల జాబితాలో జరుగుతున్న అక్రమాలపై సాక్ష్యాలను సీఈసీకి అందిస్తారు.
అపాయింట్ మెంట్ కోరుతూ ఇప్పటికే టీడీపీ కార్యాలయం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఓట్ల విషయంలో అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ ముందు నుంచి ఆరోపిస్తోంది. దొంగ ఓట్లను చేర్చడంతోపాటూ.. టీడీపీకి అనుకూలంగా ఉన్న వారి ఓట్లను తొలగిస్తోందని విమర్శిస్తోంది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి.. టీడీపీ విజ్ఞప్తి చేయనుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ ను స్వయంగా కలిసి చంద్రబాబు అన్ని ఆధారాలు అందిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.