CM Chandrababu: కేవలం 8 గంటల్లోనే సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ ముగిసింది. బుధవారం సాయంత్రం రాజమండ్రి నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లారు సీఎం చంద్రబాబు. రాత్రికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కోరారు. ముఖ్యంగా 2024 నుంచి ఏపీకి రాజధానిగా అమరావతి నిర్ణయించాలని ఈ సందర్భంగా కోరినట్టు తెలుస్తోంది. దీనివల్ల రాజధానిలో పెట్టుబడులు పెట్టే వ్యాపారవేత్తలకు భరోసా ఉంటుందని చెప్పారు.
అమిత్ షాతో గంటపాటు చంద్రబాబు భేటీ
ఏపీ ప్రయోజనాలు ముఖ్యంగా సీఎం చంద్రబాబు బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. 8 గంటల ఢిల్లీ టూర్‌లో భాగంగా గంట పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు. ఆర్థికంగా చితికిపోయిన ఏపీని గాడిన పెట్టేందుకు కేంద్రం అందిస్తున్న సహకారం అభినందనీయమని, ఇదే మద్దతును భవిష్యత్తులో కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. రానున్న బడ్జెట్‌లో ఏపీకి అన్నివిధాలుగా కేంద్రం నుంచి సహాయం చేయాలని కోరారు.
అమరావతికి చట్టబద్దత విషయమై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. అమరావతి కేవలం రాజధాని మాత్రమేకాదని, ఐదు కోట్ల ఆంధ్రుల ఆశల ప్రతిరూపమని వివరించారు. అందుకే అమరావతికి చట్టబద్ధత కల్పించాలని సీఎం చంద్రబాబు కోరారు. బిల్లు ద్వారా చట్టబద్ధత వస్తే భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ అనిశ్చితి ఉన్నా రాజధానికి ఎలాంటి ఢోకా ఉండదని వివరించారు.
కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చ
రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకగా మారుతుందని, పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని రెట్టింపు చేస్తుందని వివరించే ప్రయత్నం చేశారు. దీనికితోడు ‘జీ-రామ్-జీ’ బిల్లు గురించి చర్చించాటర. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన జీ-రామ్-జీ (G-RAM-G) పథకం వల్ల రాష్ట్రానికి ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారట సీఎం చంద్రబాబు.
గతంలో ఉపాధి హామీ పథకానికి భిన్నంగా ఇప్పుడు 60:40 నిష్పత్తిలో నిధులు భరించాల్సి రావడం కష్టంగా మారిందని తెలిపారట. ప్రస్తుతం లోటు బడ్జెట్‌లోవున్న ఏపీకి భారంగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించి ఈ పథకం అమలులో ప్రత్యేకంగా వెసులుబాటు కల్పించాలని లేదా ప్రత్యామ్నాయ ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
ALSO READ: నమ్మకానికి కన్నం.. చనిపోయిన వ్యక్తి బంగారం కాజేసిన మాజీ బ్యాంక్ మేనేజర్
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులను రానున్న బడ్జెట్‌లో కేటాయించాలని కోరినట్టు సమాచారం. హార్టికల్చర్ కేంద్రంగా రాయలసీమను అభివృద్ది చేసేందుకు సిద్ధం చేసిన వివరాలను తెలియజేశారు. పూర్వోదయ, సాస్కీ పథకం గురించి ఇటీవల మంత్రి నిర్మలా సీతారామన్‌కు ప్రతిపాదనలు సమర్పించామని గుర్తు చేశారు. పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కోరినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలాఉండగా మద్యం కేసు పురోగతి, జగన్ పాత్ర గురించి వివరాలు ముఖ్యమంత్రి సమర్పించినట్లు సమాచారం. డిసెంబర్ ఢిల్లీ పర్యటనలో అమిత్‌షాను కలవలేదు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును ఢిల్లీకి ఆహ్వానించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించి చంద్రబాబుతో అమిత్ షా చర్చించినట్లు ఢిల్లీ సమాచారం. సమావేశం తర్వాత సీఎం చంద్రబాబు తిరిగి అమరావతికి చేరుకున్నారు.