రైలు టికెట్ బుక్ చేసుకొనేప్పుడు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవడం ఎంతో ముఖ్యం. లేకపోతే ఈ మహిళకు ఏర్పడిన పరిస్థితే మీకూ ఎదురు కావచ్చు. మొబైల్ నెంబర్‌లో ఒక నెంబర్ తప్పు వేసినందుకు ఆ మహిళ భారీ మూల్యం చెల్లించుకోవల్సి వచ్చింది. రైల్లో అవమానపడటమే కాకుండా.. ఉద్యోగాన్ని కూడా కోల్పోవల్సి వచ్చింది. చివరికి ఈ విషయంలో మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకోవలసి వచ్చింది.
కేరళకు చెందిన K.జయస్మిత 2023 జూలై 30న వడక్కంచేరి నుంచి తిరువనంతపురానికి 16348 నంబర్ రైలు ఎక్కింది. తన వద్ద కన్ఫర్మ్‌డ్ టికెట్ ఉండటంతో S4 కోచ్‌లో 41వ బెర్త్‌లో కూర్చోడానికి వెళ్లింది. అప్పటికే అక్కడ మరో ప్రయాణికుడు ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. అతడు కూడా తన సీట్ నెంబర్ ఇదేనంటూ కన్ఫార్మ్‌డ్ టికెట్ చూపించాడు. ఏదో పొరపాటు జరిగి ఉండవచ్చని గ్రహించి.. టీటీఈని ఆశ్రయించింది. అయితే, ఆమె టికెట్ ఆన్‌లైన్‌లో అప్పటికే క్యానిల్ అయ్యిందని, ఆ రైలులో ప్రయాణించకూడదని టీటీఈ చెప్పారు. దీంతో ఆమె షాక్ అయ్యింది.
రైల్వే టికెట్ బుక్ చేసుకునేప్పుడు ఆమె మొబైల్ నెంబర్‌లో ఒక అంకె తప్పుగా నమోదు చేసింది. దీంతో ఆ రైలు టికెట్ వేరే వ్యక్తికి వెళ్లిపోయింది. ఆ టికెట్‌ను ఆ మొబైల్ నెంబర్ కలిగిన వ్యక్తి క్యాన్సిల్ చేశాడు. ఈ విషయం ఆ బాధితురాలికి తెలీదు. తన దగ్గర కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉంది కదా అనే ఉద్దేశంతో రైలు ఎక్కేసింది. ఆ టికెట్ చెల్లదని, రూ.500 జరిమానా చెల్లించాలని టీటీఈ చెప్పాడు. అప్పటికి ఆమె వద్ద అంత డబ్బు లేకపోవడంతో అర్ధరాత్రి సమయంలో రైలు నుంచి దింపేసి.. అరెస్టు చేశారు. క్రిమినల్ కేసు నమోదు చేశారు.
జయస్మితను అదుపులోకి తీసుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF).. టికెట్ లేకుండా లేకుండా ఉద్దేశపూర్వకంగా రైలు ఎక్కిందనే కారణంతో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసును పరిశీలించిన రైల్వే అధికారులు.. ఆ కేసును తప్పుగా నమోదు చేసినట్లు గుర్తించి.. ఉపసంహరించుకున్నారు. కానీ, దానివల్ల అప్పటికే ఆమె ఉద్యోగం కోల్పోయింది. క్రిమినల్ కేసు వల్ల ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగం నుంచి ఆమెను తొలగించారు. దీంతో ఆమె కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది.
రైల్వే చేసిన పొరపాటు వల్ల ఆమె ఉద్యోగం కోల్పోయి నరకం అనుభవించింది. ఈ ఘటనపై విచారణ జరిపిన కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ రైల్వే శాఖను బాధ్యులుగా పేర్కొంది. జయస్మితకు రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. టికెట్ బుకింగ్‌లో జరిగిన పరిపాలనా తప్పిదంతో పాటు, సమస్య తలెత్తిన తర్వాత ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళతో అధికారులు వ్యవహరించిన తీరును కూడా కమిషన్ తప్పుబట్టింది.
Also Read: రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు
రాత్రి సమయంలో ఒక మహిళను రైలు నుంచి దింపేయడం చాలా తప్పని పేర్కొంది. ఆమె విషయంలో రైల్వేస్ యాక్ట్‌లోని సెక్షన్లు 137, 139 ఉల్లంఘన జరిగినట్లు వెల్లడించింది. నెల రోజుల్లో పరిహారం చెల్లించి, చెల్లింపు పూర్తయినట్లు లిఖితపూర్వకంగా తెలియజేయాలని కమిషన్ చైర్‌పర్సన్ జస్టిస్ అలెగ్జాండర్ థామస్.. రైల్వే శాఖను ఆదేశించారు. ఆరు వారాల్లో పరిహారం చెల్లించకపోతే 8 శాతం వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.