మధ్యప్రదేశ్ కు జరిగిన ఓ షాకింగ్ ఘటనకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రేవా నగరంలో ఒక రోగిని ఆసుపత్రి స్ట్రెచర్ పై నగరం మధ్యలోకి తోసుకుంటూ తీసుకువెళుతున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. మృగనాయని చౌరస్తాలో తీసుకెళ్తుండగా ఈ వీడియోను తీశారు. సుమారు 15 సెకన్లు ఉన్న ఈ క్లిప్ లో ఒక మహిళ, ఒక వ్యక్తి స్ట్రెచర్ ను తీసుకెళ్తున్నారు. దానిపై రోగి పడుకుని ఉన్నాడు. వాహనాలతో రద్దీగా ఉన్న జంక్షన్ నుంచి ఆ రోగిని తీసుకెళ్తున్నట్లు కనిపిస్తుంది. రేవాలోని సంజయ్ గాంధీ మెమోరియల్ ప్రభుత్వ హాస్పిటల్ లో రోగి చేరినట్లు చెబుతున్నారు. అసలు ఆ రోగిని స్ట్రెచర్ మీద బయటకు తీసుకెళ్తుంటే సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇంతకీ వాళ్లు ఆ రోగిని ఎక్కడికి తీసుకెళ్లారు? అని ప్రశ్నిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఒక ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ సూచన మేరకు రోగిని ఆసుపత్రి వెలుపల తీసుకెళ్లారు. అక్కడి నుంచి మరో చోటికి తరలించాలని తెలుస్తోంది. రోగి బంధువులు అతడితో పాటు సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించారు. ఈ క్లిప్ వైరల్ అయిన నేపథ్యంలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ విచారణకు ఆదేశించింది. అధికారులు ఈ కేసును సున్నితమైన అంశంగా చెప్పుకొచ్చారు. దర్యాప్తు తర్వాత చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఈ సంఘటన నేపథ్యంలో సంజయ్ గాంధీ ఆసుపత్రిలో భద్రత, అంతర్గత నియంత్రణ గురించి పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక రోగి స్ట్రెచర్ తో పాటు బయటకు వెళ్తుంటే సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రి అధికారులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించినట్లు తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Read Also: నన్ను తల్లిని చేస్తే రూ.25 లక్షలిస్తా.. యువతి బంపర్ ఆఫర్, కక్కుర్తి పడి వెళ్లినోడు ఏమయ్యాడంటే?
సంజయ్ గాంధీ మెమోరియల్ ఆసుపత్రి ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి రాజేంద్ర శుక్లా సొంత జిల్లాలో ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ విమర్శలు తీవ్రతరం అయ్యాయి. ఆరోగ్యమంత్రి సొంత జిల్లాలోనే ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి ఇలా ఉంటే, మిగతా ప్రదేశాల్లో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. ప్రభుత్వ వైద్యం పట్ల గవర్నమెంట్ ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఈ ఘటన నిరూపిస్తుందన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. అటు ప్రజలకు కూడా ప్రభుత్వ వైద్యం విషయంలో నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు.
Read Also: నా డెత్ సర్టిఫికెట్ పోయింది.. న్యూస్ పేపర్‌లో ఊహించని ప్రకటన, ఎవరు ఆ ఆత్మారాం?