Stampede At Kasibugga: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రధానీ మోదీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం జరగడం విచారకరమని సోషల్ మీడియ వేదికగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట బాధాకరం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నానని తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు PMNRF నుండి ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు , గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్ గ్రేషియా ప్రకటించారు ప్రధానీ మోదీ.
పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి
శ్రీకాకుళం జిల్లా, పలాస – కాశీబుగ్గ పట్టణం లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో.. ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి వేలాదిగా భక్తులు పోటెత్తడంతో జరిగిన తొక్కిసలాటలో 12 మంది భక్తులు మరణించడం అత్యంత దురదృష్టకరం అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వారిలో చిన్నారి కూడా ఉండటం తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. వారు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాను. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని తెలియజేస్తున్నాను. ఆధ్యాత్మికంగా విశిష్టమైన రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల వద్ద భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేలా, ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా చూడాలని అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నానని పవన్ అన్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా
శ్రీకాకుళంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై..కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్పందిస్తూ.. తొక్కిసలాటలో ప్రాణనష్టం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అమిత్ షా పేర్కొన్నారు.