Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోటా పోటీ ప్రచారం.. విజయం మాదంటే మాదని ధీమా వ్యక్తం.. జూబ్లీలో కచ్చితంగా గెలిసి తీరాలని ఈ రెండు ప్రధాన పార్టీలు ప్రచారంలో బిజీ అయిపోయాయి. అయితే ఈ ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న పకడ్బందీ వ్యూహాలు ప్రతిపక్ష బీఆర్ఎస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాజకీయంగా, సామాజికంగా, అభివృద్ధి పరంగా ఎటువంటి అవకాశాన్ని వదలకుండా సీఎం రేవంత్ రెడ్డి కదుపుతున్న పావులు ప్రత్యర్థుల్లో గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. కేవలం సెంటిమెంట్ ఆధారంగా విజయంపై ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్‌కు ఇప్పుడు పరిస్థితి దిక్కుతోచని విధంగా మారందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
⦿ బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పాలనను పోలిస్తే..
అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్‌లో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. పదేళ్లు పాలనలో ఉన్న బీఆర్ఎస్ తో పోలిస్తే రెండేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే అభివృద్ది వైపు దూసుకెళ్తుందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. ఈ క్రమంలో నవీన్ యాదవ్ అభ్యర్థత్వాన్ని కాంగ్రెస్ ప్రకటించగానే ప్రజల ఆదరణ రెట్టింపు అయ్యింది. మరోవైపు, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వ్యవహారశైలి నచ్చక నియోజకవర్గ ప్రజల నుంచే కాకుండా సొంత కుటుంబం నుంచి కూడా ఆమెకు మద్దతు కరువైందన్న చర్చ కూడా బయట నడుస్తోంది.
⦿ లక్ష మందికి సంక్షేమ పథకాలు లబ్ది..
సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసిన వ్యూహాలను బీఆర్ఎస్ పసిగట్టేలోపే అవి చాపకింద నీరులా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నాయి. స్థానికంగా ఈ వ్యూహాల గురించే ప్రజలు చర్చించుకొనే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడి అన్ని డివిజన్ల బాధ్యతలను సీనియర్ మంత్రులకు అప్పగించి చేపట్టిన అభివృద్ధి పనులపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే.. నియోజకవర్గంలో ఉన్న 3.98 లక్షల ఓటర్లలో లక్ష మంది ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందడం కాంగ్రెస్‌కు బలమైన సానుకూలాంశంగా మారింది.
⦿ ఇది సీఎం రేవంత్ రాజకీయ చాణక్యత..
ఈ ఉపఎన్నికలో ఎంఐఎం మద్దతును కూడగట్టడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ చాణక్యతను ప్రదర్శించారు. ఈ వ్యూహం నియోజకవర్గంలోని బలమైన మైనారిటీలు గంపగుత్తగా కాంగ్రెస్ వైపు చూసేలా చేసింది. ఇది బీఆర్ఎస్‌కు పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. అంతేకాకుండా, మైనారిటీలకు ప్రాతినిధ్యం దక్కలేదన్న విమర్శలకు చెక్ పెడుతూ.. అజారుద్దీన్‌ను క్యాబినెట్‌లోకి తీసుకోవాలని నిర్ణయించడం ద్వారా రేవంత్ రెడ్డి విపక్షాల నోళ్లు మూయించగలిగారు.
⦿ కమ్మ సామాజిక వర్గం ఎటువైపు..?
గతంలో బీఆర్ఎస్ వైపు ఉన్న కమ్మ సామాజిక వర్గం కేటీఆర్‌పై ఉన్న అహంకారపూరిత వైఖరి నచ్చక బీఆర్ఎస్‌కు దూరమైంది. ఈ క్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రంగంలోకి దింపిన సీఎం రేవంత్ రెడ్డి, ఆ వర్గం కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించేలా చేయగలిగారు. నియోజకవర్గంలో బలమైన యాదవ సామాజిక వర్గాన్ని ఏకపక్షంగా తమ వైపు తిప్పుకోవడానికి సీనియర్లను కాదని నవీన్ యాదవ్‌కు టికెట్ కేటాయించారు. దీనితో పాటు ముదిరాజ్ పోరాట సమితి, బీసీ సంక్షేమ సమితి వంటి సంఘాలు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడానికి మార్గం సుగమమైంది.
⦿ ప్రచారానికి ముందే వ్యూహాల అమలు..
జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా ఉండే సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంలో సీఎం రేవంత్ రెడ్డిది కీలక పాత్ర. సమ్మెకు దిగిన కార్మిక సంఘాలతో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ద్వారా చర్చలు జరిపించి.. వారి వేతనాల పెంపునకు చిత్రపరిశ్రమ నిర్మాతలు అంగీకరించేలా చేశారు. దీనిపై హర్షం వ్యక్తం చేసిన సినీ కార్మిక సంఘాలు ఇటీవల సీఎంను సన్మానించడం రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు నిదర్శనం. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. రాజకీయంగా, అభివృద్ధి పరంగా, సామాజికంగా వ్యూహాత్మకంగా పావులు కదిపిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభానికి ముందే కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్‌లో తిరుగులేని శక్తిగా నిలబెట్టగలిగారు.