Vallabhaneni Vamsi : వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులు హైదరాబాద్ లో వైసీపీ నేత వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో దాదాపు 8 గంటల పాటు విచారణ జరిపిన కృష్ణలంక పోలీసుల.. రాత్రి 10 గంటల ప్రాంతంలో జీజీహెచ్ లో వైద్య పరీక్షలు జరిపించారు. వైద్య పరీక్షల్లో అతని ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తేలడంతో.. రిమాండ్ కోరుతూ న్యాయమూర్తి ఎదుట వంశీని తరలిస్తున్నారు.
ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏ1గా వల్లభనేని వంశీ, ఏ7గా శివరామ కృష్ణప్రసాద్ లను చేర్చారు. ఏ8గా నిమ్మ లక్ష్మీపతి లను రిమాండ్ రిపోర్టులో చేర్చారు.
దీంతో.. ఈ కేసులో వల్లభనేని వంశీ జైలుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే.. అతనికి న్యాయమూర్తి జైలు శిక్ష విధిస్తే జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. వంశీని విచారణ కోసం హైదరాబాద్ నుంచి తీసుకువచ్చినప్పటి నుంచి వైసీపీ శ్రేణులు తీవ్ర నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. వైద్య పరీక్షలకు తీసుకెళ్తున్న సమయంలోనూ వందల మంది పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పోలీసుల వాహనాలకు అడ్డుగా వచ్చి ఆందోళనలు చేపట్టారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై.. టీడీపీ ఆఫీసు మీద దాడి కేసుతో పాటు.. ఆ ఘటనలో ఫిర్యాదు చేసిన వ్యక్తిని కిడ్నాప్ చేశారనే కేసులు బనాయించారు. ఆయన్ను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న సమయంలో బీఎన్‌ఎస్ సెక్షన్ 140(1), 308, 351(3) రెడ్‌విత్ 3(5) కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అలాగే, వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సైతం నమోదైంది. అతను కిడ్నాప్ చేసింది.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే.. ఈ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.