CM Chandrababu: మొంథా తుఫాన్ తీరం దాటడంతో ఊపిరి పీల్చుకుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటివరకు ప్రజలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం, సహాయకచర్యలపై ఫోకస్ చేసింది. తుఫాన్ కారణంగా వేటకు వెళ్లకుండా ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందించనుంది. ఒక్కో మత్స్యకార కుటుంబానికి 50 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు.
తుఫాను ప్రాంతాలపై సీఎం చంద్రబాబు దృష్టి
ఏపీకి తుఫాన్ గండం ముగియడంతో సహాయక చర్యలపై దృష్టి సారించారు సీఎం చంద్రబాబు. మంగళవారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు రివ్యూలు, సమీక్షలు నిర్వహించారు. తుఫాన్ తీరం దాటడంతో ఊపిరి పీల్చుకున్నారు. తీరం ధాటే సమయంలో బీభత్సం సృష్టిస్తుందని భావించినప్పుటికీ అలాంటిదేమీ జరగలేదు.
కాకపోతే తీరం దాటే ముందు భారీ వర్షాలకు, బలమైన గాలులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పుడు వాటిపై ఫోకస్ చేశారు. తుఫాన్ కారణంగా గడిచిన ఐదురోజులుగా మత్య్సకారులు తీవ్రంగా నష్టపోయారు. ఒక్కో మత్స్యకార కుటుంబానికి 50 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు సీఎం చంద్రబాబు. తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అత్యవసర సరకుల పంపిణీకి ఉత్తర్వులు ఇచ్చారు.
బియ్యంతోపాటు కిలో కందిపప్పు, లీటర్ నూనె, ఉల్లిపాయలు పంపిణీ చేయాలని ఆదేశించారు. సరుకుల పంపిణీ ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఉల్లిపాయలు, కూరగాయల సరఫరా బాధ్యతను మార్కెటింగ్ కమిషనర్‌కు అప్పగించారు. నష్టం అంచనాపై త్వరితగతిన నివేదికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.
తుఫాను ప్రభావిత జిల్లాలకు సీఎం చంద్రబాబు?
మొంథా తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా పరిస్థితిని సమీక్షించారు. రెండు సార్లు ఆర్టీజీ సెంటర్ నుంచి సమీక్షలు చేశారు. మరో రెండు సార్లు టెలీకాన్ఫరెన్సులు నిర్వహించారు. మూడోసారి ఆర్టీజీ సెంటర్ నుంచి మొంథా తుఫానుపై సమీక్ష చేపట్టిన సీఎం చంద్రబాబు, వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ జిల్లాల్లో భారీగా చెట్ల నేలకూలాయి. వాటిని తొలగింపు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యుత్ వైర్లు నేలపై పడడం, స్తంభాలు కూలడం, సబ్ స్టేషన్లలో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచన చేశారు. మరోవైపు పునరావాస కేంద్రాల్లో అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి.
ALSO READ: తుఫాన్ ప్రభావిత ప్రాంతాలపై పవన్ ఫోకస్, నష్టం వివరాలు సేకరణ
సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, అనిత, నారాయణ ఆర్టీజీఎస్ కేంద్రంలో పర్యవేక్షణ చేస్తున్నారు. తుఫాను ప్రభావంపై అధికారులకు సూచనలు ఇస్తున్నారు. జిల్లాలకు వెళ్లిన మంత్రులతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. తుఫాన్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక టీమ్‌తో ఆర్టీజీ సెంటర్ నుంచి నిరంతరం చర్చించారు సీఎం చంద్రబాబు.
వర్షం తగ్గిన తర్వాత తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాలకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. బుధవారం సాయంత్రం బయలుదేరుతారా? లేక గురువారం ఆయా జిల్లాలకు వెళ్తారా అనేది ఇంకా క్లారిటీ రావాల్సివుంది. అటు నుంచి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం వెళ్లనున్నట్లు సమాచారం.