Heavy Rains: మొంథా తుఫాన్ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, తదితర జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి వర్షం ఎడ తెరపి లేకుండా పడుతోంది. భారీ వర్షాలకు ప్రజలు బిక్కుబిక్కు మంటూ జీవనం కొనసాగిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కొన్ని చోట్ల వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలను హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ చేసింది.
వరంగల్, హన్మకొండలో ఇది పరిస్థితి..
ఇప్పటికే వరంగల్, హన్మకొండ, జనగామ, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. హన్మకొండలో అయితే రోడ్ల పైకి బీభత్సమైన వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ భారీ వరదలకు నగరవాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్ లో కూడా పట్టాలపైకి భారీ వరద నీరు ప్రవహిస్తోంది. వరంగల్ అండర్ బ్రిడ్జి వద్ద వరద ఫ్లోటింగ్ కొనసాగుతోంది. పోస్టాఫీస్- వరంగల్ అండర్ బ్రిడ్జి– మామునూర్ కు పోయే రూట్ లో భారీ వరద నీరు ప్రవహిస్తుంది. రోడ్లపై వరద నీరు చెరువులను తలపిస్తోంది.
Hanamkonda pic.twitter.com/Hes85uO1tI
— Mr. D (@DineshRedEE) October 29, 2025
కాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం
వరంగల్, హన్మకొండ నగరాల్లో మరి కొన్ని గంటల్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే మరి కాసేపట్లో సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అలాగే జగిత్యాల, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కుండపోత వర్షం పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. అక్కడక్కడ పిడుగులు కూడా పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ జిల్లాల ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ పరిస్థితి ఉందంటే..?
మొంథా సైక్లోన్ ఎఫెక్ట్ హైదరాబాద్ మహా నగరంపై కూడా పడింది. ఇప్పటికే ఉదయం నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. మరో గంట నుంచి 2 గంటల్లో హైదరాబాద్ వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాత్రి వేళ పలు చోట్ల వర్షం పడే ఛాన్స్ ఉంది. మరి కొన్ని చోట్ల పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.