Cyclone Montha Update: ఏపీని గజగజ వణికించిన మొంథా తుఫాను తీరం దాటింది. మంగళవారం అర్ధరాత్రి కాకినాడకు దక్షిణంగా నరసాపురానికి సమీపంలో తీరం దాటినట్లు ఐఎండీ ప్రకటన చేసింది. రాత్రి 11.30 గంటల నుంచి 12.30 మధ్యలో తీరం దాటే ప్రక్రియ పూర్తయినట్లు వెల్లడించింది.
ఏపీని వణికించింది మొంథా తుఫాన్
ఇది రానున్న 6 గంటల్లో తుపానుగా బలహీనపడనుందని వెల్లడించింది. అయితే తీరం దాటే సమయంలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదిలినట్టు పేర్కొంది. ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణించి బుధవారం మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్ వద్ద బలహీనపడతుందని పేర్కొంది. తుఫాను ప్రభావంతో గాలులు బలంగా వీస్తున్నాయి. ప్రస్తుతం గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలుల వేగం కొనసాగుతోందని పేర్కొంది.
దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తుఫాను నేపథ్యంలో గడిచిన 12 గంటల్లో నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 23 సెంటి మీటర్లు వర్షపాతం నమోదు అయ్యింది. ఉలవపాడులో 17 సెంటీమీటర్లు, చీరాలలో 15 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు అయినట్టు అధికారులు తెలిపారు.
అర్థరాత్రి తీరం ధాటింది
బుధవారం నాడు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుపాను ప్రభావం అటు రాయలసీమపై ఉంటుందని అధికారులు తెలియజేశారు.
ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చారు. తుఫాను తీరం దాటినప్పటికీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాలవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, ఒడిషా, కేరళ, తమిళనాడు, కర్ణాటక లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ALSO READ: టీడీపీకి దిక్కెవరు.. ఉమ్మడి చిత్తూరుపై బాబు ప్లానేంటి?
తుఫాను తీరం ధాటే ముందు తూర్పు-పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలో గాలులు పెను ప్రభావం చూపాయి. బలమైన ఈదురు గాలులతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. ఫలితంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
కోనసీమ జిల్లాలో పెనుగాలుల కారణంగా చెట్టు కూలిపోవడంతో ఓ మహిళ మరణించింది. తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో 38,000 హెక్టార్లలో పంటలు నాశనమయ్యాయి.అలాగే 1.38 లక్షల హెక్టార్లలో ఉద్యానవన పంటలు తీవ్రంగా డ్యామేజ్ అయినట్టు అధికారుల అంచనా.
(A) Severe Cyclonic Storm “Montha” [Pronunciation: Mon-Tha] weakened into a Cyclonic Storm over coastal Andhra Pradesh
The Severe Cyclonic Storm “Montha” [Pronunciation: Mon-Tha] over coastal Andhra Pradesh moved nearly northwestwards with a speed of 10 kmph during past six… pic.twitter.com/cDQmMDqdVm
— India Meteorological Department (@Indiametdept) October 28, 2025