Pothuluri Veera Brahmendra Swamy: పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి… ప్రపంచవాప్తంగా ఈయన పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. జగత్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ప్రతి ఒక్కరు నమ్ముతారు. 400 ఏళ్ల క్రితమే రాబోయే భవిష్యత్తులో తలెత్తే మార్పులు, విపత్తులు, వింతల గురించి తన కాలజ్ఞానం పుస్తక రచనలో వెల్లడించారాయన. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన అనేక సంఘటనలు అనంతర కాలంలో నిజమవుతూ రావడంతో ఆయన కాలజ్ఞానం ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతటి మహోన్నతమైన వ్యక్తి నివసించిన ఇల్లు… ఇప్పుడు మొంథా వర్షాల దాటికి కుప్పకూలటం భక్తులలో తీవ్ర ఆవేదనను రేపుతోంది.
తుఫాన్ ధాటికి బ్రహ్మంగారి నివాసం కూలడంతో భక్తుల్లో తీవ్ర కలవరం. ఆయన కాలజ్ఞానంలో ఇది ముందే ఉందా? లేక ప్రకృతి ప్రకోపమే దీనికి కారణమా? అని భక్తులు చర్చించుకుంటున్నారు. బ్రహ్మంగారు 85వ ఏట వైశాఖ శుద్ధ దశమినాడు సజీవ సమాధిలోకి ప్రవేశించారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. బనగానపల్లెలో ఆయన రచించిన 14 వేల కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి దానిపై చింతచెట్టును పెంచి పూజించటం విశేషం. దైవ స్వరూపుడైన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విద్యుత్తు, యంత్రాలు, విమానాల రాక, అంతరిక్ష యానాలు, రాజులు పోయి ప్రజాస్వామిక ప్రభుత్వాలు రావడం వంటి అనేక జోస్యాలు నిజమవ్వడంతో…. బ్రహ్మంగారి కాలజ్ఞానంకు మరింత ప్రఖ్యాతి ఏర్పడింది. చైనా దిక్కులో కొత్త రోగం పుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తుందంటూ కరోనా వైరస్ గా గూర్చి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పడం విశేషం.
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పదహారు వందల తోబ్బై మూడులో జీవసమాధి అయిన ప్రాంతంలో దేవాలయం నిర్మించి మఠం ఏర్పాటు చేశారు. ఇక్కడ బ్రహ్మంగారు నివసించిన ఇల్లు 17వ శతాబ్దంలో బ్రహ్మంగారు తిరిగి వచ్చి నిర్మించుకున్నారు. అప్పట్లో అక్కడున్న స్థానికులు ఆయనను కనీసం తాగడానికి నీరు ఇవ్వకపోతే రాత్రి మొత్తం జింక కొమ్ముతో బావిని త్రవ్వి నీటి అవసరాలు తీర్చుకున్నారని గ్రంథాలు చెప్తున్నాయి. ఈ ఘటన ఆయన దైవిక శక్తిని, స్వావలంబనను చిరస్థాయిగా నిలిపింది. మఠంగా ఆవిర్భవించిన నాటి నుంచి వరుసగా మఠానికి మఠాధిపతులుగా వారి కుటుంబ సభ్యులే ఉంటూ వస్తున్నారు. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠం ఏడవతరం 11వ పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి 2021 మే 8న పరమపదించారు. వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి చనిపోయేనాటికి 52 సంవత్సరాలు పీఠాధిపతిగా కొనసాగారాయన.
ఇంతటి చారిత్రక ప్రాముఖ్యత కలిగిన బ్రహ్మంగారి నివాస గృహాన్ని కాపాడాల్సిన అధికారులు… ఆ విషయంలో అలసత్వం వహించారని భక్తులు మండిపడుతున్నారు. 16 శతాబ్దం నాటి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసం పట్ల అధికారులు శ్రద్ధ చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శిథిలావస్థలో ఉన్నప్పుడు మరమ్మతులు చేయించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. ఈ విషయంలో బ్రహ్మంగారి వారసులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. కోట్లు ఖర్చుపెట్టి బ్రహ్మంగారి మఠాన్ని అభివృద్ధి చేస్తున్నామంటున్న అధికారులు.. ఈ ఘటనకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నిస్తున్నారు. ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరబ్రహ్మంగారి మఠం అభివృద్ధి చేస్తున్నామని అధికారులు గొప్పలు చెప్పడం కాదని ఇకనైనా బ్రహ్మంగారి మఠంపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.
వర్షాల ధాటికి కూలిపోయిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాస గృహం pic.twitter.com/ugvMe5M1M1
— vijay marka (@VijayMarka88) October 29, 2025