Onion Farmers: కర్నూలు జిల్లా ఉల్లి రైతులు గిట్టుబాటు ధరలు లేక.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఆస్పరి మండలం యాటకల్లు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనే రైతు.. రెండు ఎకరాలలో ఉల్లి పంట సాగు చేశాడు. ఈ పంటపై ఆయన సుమారు రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టినా, మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశాడు. తాము ఆశించిన మద్దతు ధర లభించకపోవడంతో.. కష్టపడి పండించిన ఉల్లిని వాగులో పారేయాల్సిన పరిస్థితి నెలకొంది.
రైతులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఒక క్వింటా ఉల్లికి కనీసం రూ.1200 మద్దతు ధర లభిస్తుందని ఆశించారు. అయితే ప్రభుత్వం ఆ మద్దతు ధరను రద్దు చేసి, హెక్టార్‌కు రూ.50 వేల రూపాయల సహాయం అందిస్తామని ప్రకటించింది. కానీ ఈ విధానం రైతులకు సరైన ఉపయోగం కలిగించడం లేదని వారు అంటున్నారు. ఎందుకంటే ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్న సమయంలో.. పంటకు కనీస ధర లేకపోవడంతో పెట్టుబడులు తిరిగి రాకుండా పోతున్నాయి.
రైతులు కష్టపడి పండించిన ఉల్లిని మార్కెట్లో విక్రయించలేక, పొలాల పక్కనే ఉన్న వాగులో పారేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఉల్లి బస్తాలను చూసి జనం బారులు తీరుతున్నారు.
ఉల్లి పంటలో ఎక్కువ శ్రమ అవసరం ఉంటుంది. సాగు మొదలుపెట్టినప్పటి నుంచి కోత వరకు.. భారీగా కూలీలపై ఆధారపడాల్సి వస్తోంది. కూలీల ఖర్చులు పెరగడంతో రైతులపై అదనపు భారమైంది. పెట్టుబడి వసూలు కావడమే కాకుండా నష్టాలను మోయాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రతి ఏటా ఉల్లి పండించినా గిట్టుబాటు ధర కల్పించడంలేదని.. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు ఉల్లికి దేశంలో ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ, సరైన ధర రాకపోవడం రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోందని వారు చెబుతున్నారు. మహారాష్ట్రలో ఉల్లి ఉత్పత్తిని నియంత్రించడానికి చర్యలు తీసుకుంటారు, కానీ కర్నూలు రైతులను మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read: పసిడి పరుగో పరుగు.. గోల్డ్ రేట్ @2 లక్షలు
మాకు కనీసం రూ.1200 మద్దతు ధరను కల్పించాలి. లేకపోతే ఉల్లి పంటను సాగు చేయలేమని వారు చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ, తమ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
గిట్టుబాటు ధర లేక ఉల్లి పంటను పారబోస్తున్న రైతులు..
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం యాటకల్లు గ్రామంలో 2 ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేసిన రైతు చంద్రశేఖర్
రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టినా గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయామని రైతు ఆవేదన pic.twitter.com/bL47nj3u9K
— BIG TV Breaking News (@bigtvtelugu) October 1, 2025