Rajahmundry To Tirupati Flight Service: రాజమహేంద్రవరం-తిరుపతి మధ్య విమాన సర్వీసులను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, బీజేపీ ఎంపీ పురందేశ్వరి దిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. నేటి నుంచి రాజమండ్రి-తిరుపతి మధ్య విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. అలయన్స్ ఎయిర్ ఆధ్వర్యంలో వారానికి మూడు రోజులు మంగళ, గురు, శనివారాల్లో ఈ విమాన సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.
రాజమండ్రి-తిరుపతి మధ్య తొలి విమానాన్ని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరితో కలిసి ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి విమానాశ్రయం నుండి ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బచ్చయ్య చౌదరి పలువురు నేతలు పాల్గొన్నారు.
‘ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని అయిన తిరుపతి, ఇప్పుడు నేరుగా సాంస్కృతిక రాజధాని రాజమండ్రితో అనుసంధానమైంది. దసరా పండుగ సందర్భంగా ప్రారంభించిన ఈ విమాన సర్వీసుల్లో ముందస్తు బుకింగ్‌ల ద్వారా అన్ని విమానాలలో 100% ఆక్యుపెన్సీతో అద్భుత స్పందన లభించింది. ఈ విమాన సర్వీసులకు కనెక్టివిటీ అందించిన అలయన్స్ ఎయిర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గోదావరి ప్రాంతం అభివృద్ధి కేంద్రంగా రాజమండ్రి వేగంగా ఎదుగుతోంది’ అని రామ్మోహన్ నాయుడు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కేవలం ఆరు నెలల వ్యవధిలోనే దిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాలకు నేరుగా విమాన సేవలు ప్రారంభించామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. కనెక్టెడ్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో రాష్ట్ర వైమానిక అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడంలో కృషి చేస్తున్నామన్నారు.
బుధవారం ఉదయం 7:40కు తిరుపతి నుంచి బయలుదేరిన తొలి విమానం 9:25 గంటలకు రాజమండ్రి చేరుకుంది. ఉదయం 9:50కు రాజమండ్రి నుంచి బయలుదేరి 11:20 గంటలకు తిరుపతి చేరుకొంది. ఈ విమాన సర్వీసుతో రాజమండ్రి-తిరుపతి మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గింది. ఈ సర్వీసులో మూడు నెలల పాటు ముందుగా బుక్ చేసుకున్న మొదటి 35 టికెట్లు రూ.1999లకే అందిచారు. మిగిలిన 35 టికెట్లు 4000 రూపాయలకే అందుబాటులో ఉంచినట్లు అలయన్స్ ఎయిర్ ప్రతినిధులు తెలిపారు.
త్వరలోనే రాజమండ్రి నుండి గోవా, కొచ్చి, వారణాసిలకు విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్టు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో మరిన్ని విమాన సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. బెంగళూరుకు మరొక అదనపు విమానాశ్రయం ఏర్పాటు చేస్తామన్నారు.
మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ…” రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసు..రాజమండ్రి ప్రాంత వాసుల చిరకాల కోరిక. ఆ కోరికను కార్యరూపం దాల్చేలా చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి కి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పినట్లు రాజమండ్రి నుంచి తిరుపతికి వెళ్లే విమానంలో మొదటి మూడు నెలల పాటు మొదటి 35 మందికి రూ.1999 లకు, తరువాత 35 మందికి రూ.4000 లకు విమాన సర్వీసు అందించడం చాలా మందికి ఉపయోగం పడుతుందని తెలిపారు.
Also Read: DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపునకు కేబినెట్ ఆమోదం
విమాన చార్జీలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నందుకు కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఏ దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యం అందులోనూ ఎయిర్ కనెక్టివిటీ ఎంతో ముఖ్యం అన్నారు. రాజమండ్రి నుంచి ఎయిర్ కనెక్టివిటీ పెరుగుదలకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, దేశ వ్యాప్తంగా విమాన సర్వీసుల ద్వారా వివిధ రాష్ట్రాలకు అనుసంధానిస్తున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.