పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి ప్రస్తుతం టిడిపి అధ్యక్ష పదవిపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠత నెలకొంది. ఇప్పటికే ఈ పదవిని ఆశిస్తున్న ఏపీఐఐసీ చైర్మన్, ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు, భీమవరం మాజీ ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావులపై టిడిపి అధిష్టానం ఐవిఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా పార్టీ శ్రేణుల నుండి అభిప్రాయం సేకరించింది. ఈ పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు టిడిపి జిల్లా అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో అనే దానిపై అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిపై సీనియర్ నాయకులు చాలామంది ఆశపెట్టుకున్నప్పటికీ, రేసులో మాత్రం కోళ్ల నాగేశ్వరరావు, మంతెన రామరాజులు ప్రధానంగా ఫోకస్ అవుతున్నారు. ఇప్పటికే క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు అలియాస్ రాంబాబు పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే ఆయనకు ఏపీఐఐసి చైర్మన్ పదవిని ప్రభుత్వం కట్టబెట్టగా, పార్టీ అధ్యక్ష పదవిలో కూడా కొనసాగిస్తారా, లేదా అనేది సందేహంగా మారింది. జోడు పదవులు ఎందుకన్న ప్రశ్నలు పార్టీలో వినిపిస్తుండడంతో నామినేటెడ్ పోస్టు అనుభవిస్తున్న రామరాజును పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
పార్టీ సీనియర్ నాయకుడు, భీమవరం ఏఎంసి మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు పార్టీకి కష్ట కాలంలో అండగా ఉన్న నేత. కాపు సామాజిక వర్గానికి చెందిన కోళ్ల నాగేశ్వరరావు కు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీకి ఎంత మేర మేలు జరుగుతుందనే దానిపై కూడా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారంట. ఈ పరిస్థితుల్లోనే కోళ్ల నాగేశ్వరరావు, రామరాజుల మధ్య ఐవిఆర్ఎస్ ఫోన్ ద్వారా జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణుల నుండి చంద్రబాబు అభిప్రాయాలను సేకరించారు. ప్రస్తుతం ఈ నివేదిక చంద్రబాబు వద్దనే ఉందని తెలుస్తుంది.
తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి పశ్చిమగోదావరి జిల్లాలో ఏ ఎన్నికలు వచ్చినా విజయం భారీగా ఉండాలని అధిష్టానం కూడా ప్రత్యేక దృష్టి పెడుతూ వస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి ఫ్యాన్ గాలి వీచినప్పుడు కూడా ఇక్కడ ఉండి, పాలకొల్లు నియోజకవర్గాలలో తెలుగుదేశం ఎమ్మెల్యేలే గెలుపొందారు. అలాంటి ఈ జిల్లాలో అందులోను అధికారంలో ఉండటంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి సత్తా చాటాలంటే సమర్థవంతమైన నాయకుడు జిల్లా అధ్యక్ష పదవిలో ఉండాలని అధిష్టానం ఆలోచన చేస్తుంది.
ప్రస్తుత జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంతెన రామరాజును పక్కనపెడితే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు ముందంజలో ఉన్నారని చెప్పొచ్చు. విద్యార్థి దశ నుండే ప్రజా సమస్యలపై విద్యార్థి సమస్యలపై పూర్తి అవగాహనతో ప్రజల కోసం పోరాటాలు చేస్తూ వచ్చిన కోళ్ల నాగేశ్వరరావు 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలోనే ఆ పార్టీలో చేరారు. 40 ఏళ్లకు పైగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ అనేక పదవులు అలంకరించిన కోళ్ల నాగేశ్వరరావు 2016 నుండి 2019 వరకూ భీమవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా కూడా పనిచేశారు.
గత ఎన్నికల్లో చింతలపూడి, పోలవరం అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల పరిశీలకులుగా పనిచేసి, తర్వాత కాకినాడ రూరల్ కాకినాడ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం పరిశీలకులుగా పనిచేస్తూ వచ్చారు. రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఉంటూ దాదాపు 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పనిచేసిన కోళ్ల నాగేశ్వరరావుకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు నాగేశ్వరరావు సన్నిహితులు అంటున్నారు.
పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ కూడా కోళ్ల నాగేశ్వరావు పేరును ఆశవాహుల జాబితాలో ముందు క్రమంలో పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కు జిల్లా పార్టీఅధ్యక్ష బాధ్యతలు ఇవ్వొచ్చని కొందరు ప్రతిపాదనలు చేస్తున్నా, ఆయన అందుకు సుముఖంగా లేరని పార్టీలో కొందరు చర్చించుకుంటున్నారు. ఇక ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ కూడా గతంలో మంత్రిగా, పోలిట్ బ్యూరో సభ్యునిగా పనిచేశారు. ఆయన జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు మాత్రం ఆయన ముందుకు రాకపోవడంతో.. పార్టీలో కష్టపడ్డ వారు పార్టీ కోసం త్యాగాలు చేస్తున్న వారు ఎవరు అనే కోణంలో అధిష్టానం జాబితా సిద్ధం చేస్తుందట.
Story By Big tv