Amaravati News: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొత్త ప్లాన్ ఏంటి? ఎన్నికల్లో వివిధ ప్రాంతాల ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు రెడీ అయ్యిందా? న్యూఇయర్‌కి ముందు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని భావిస్తోందా? అరడజను జిల్లాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయనున్నారు? వేగంగా పావులు కదపడానికి కారణమేంటి? అన్నదానిపై ఓ లుక్కేద్దాం.
న్యూఇయర్‌కు కొత్తగా ఆరు జిల్లాలు
తెలంగాణ నుంచి ఏపీ విడిపోయిన తర్వాత 13 జిల్లాలు ఉండేవి. దాన్ని జగన్ సర్కార్ 26 జిల్లాలుగా మార్చింది. జిల్లా కేంద్రాలు, సరిహద్దులు, జిల్లాల పేర్లపై వివాదం రగడ నలుగుతూనే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి వివిధ జిల్లాల నుంచి ఎక్కువగా వినతులు వచ్చాయి. వాటిలో కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం ఉంది. దీనిపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించిందని తెలుస్తోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు.
వచ్చే ఏడాది నుంచి కేంద్రప్రభుత్వం జనగణన చేపట్టనుంది. ఈ నేపథ్యంలో 2026 జనవరి ఒకటి నుంచి 2027 మార్చి చివరకు వరకు జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్ల మార్పుకు ఎలాంటి అవకాశం ఉండదు. ఈ పని చేసినా ఈ ఏడాది డిసెంబర్ 31లోగా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎన్నికల హడావుడి నెలకొననుంది, ఆ తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు చేయడం దాదాపు అసాధ్యం.
ఉత్తరాంధ్ర-సీమలో ఒకొక్కటి
ఈలోగా ఆ పని చేయాలన్నది కూటమి ప్రభుత్వం ఆలోచన. దీని ఆధారంగా చకచకా అడుగులు వేస్తోంది. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్.. జనాభా, భౌగోళికంగా పెద్దది. ప్రస్తుతం 26 జిల్లాలు ఉన్నాయి. వీటిని 32 జిల్లాలుగా చేయాలని ప్లాన్ చేస్తోంది కూటమి సర్కార్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాలపై సాధ్యాసాధ్యాలపై దృష్టి సారించింది.
ఇప్పటికే వివిధ జిల్లాల ప్రజల నుంచి వినతులు స్పీకరించింది కేబినెట్ సబ్ కమిటీ. కొన్ని జిల్లాలు విస్తీర్ణ పరంగా పెద్దదిగా ఉన్నాయి. జిల్లా కేంద్రాలకు రాకపోకలకు సుదూరంగా ఉండడం దీనికి కారణమైంది. వాటిపై ఇప్పుడు చంద్రబాబు సర్కార్ ఫోకస్ చేసింది. న్యూఇయర్ లోపు కొత్తగా ఆరు జిల్లాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
ALSO READ: పశ్చిమగోదావరి టీడీపీ పగ్గాలు ఎవరికో
ఉమ్మడి శ్రీకాకుళం నుంచి పలాస, ప్రకాశం నుంచి మార్కాపురం, చిత్తూరు జిల్లా మదనపల్లె, నెల్లూరు నుంచి గూడూరు, కడప నుంచి రాజంపేట, గుంటూరు నుంచి అమరావతి కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తోంది. దీనిపై కొన్నాళ్లు ప్రచారం సాగుతోంది కూడా. ఈ రెండు నెలల్లో మంత్రివర్గం ఉప సంఘం ఇచ్చే నివేదికను కేబినెట్‌లో పెట్టి చర్చించనుంది.
ఈ రెండు నెలల్లో కొత్త జిల్లాల వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తోంది. లేకుంటే మరో 15 నెలలు ఆగాల్సి వుంటుంది. ఈలోగా ఎన్నికలకు సమయం ముంచుకొస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ మూడో వారానికి వాటిని పూర్తి చేయాలని ఆలోచన చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 26 నుంచి కొత్త జిల్లాలను అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు ప్రభుత్వం వర్గాలు చెబుతున్నారు.