దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని భావిస్తున్నారంట మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్.. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి పెద్దదిక్కుగా ఉన్న ఆయన ఇక తాను ప్రత్యక్ష రాజకీయాల్లో రిటైర్మెంట్ తీసుకుని తన కుమారుడు కృష్ణచైతన్యను ఈ సారి నరసన్నపేట నుంచి వైసీపీ అభ్యర్ధిగా బరిలో దించాలని చూస్తున్నారంట.. అసలు గత ఎన్నికల్లోనే వారసుడ్ని బరిలోకి దించాలని కృష్ణదాస్ భావించారు.. అయితే జగన్ అంగీకరించకపోవడంతో తతానే బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు. మరి ఈ సారి ఆయన ప్రయత్నాలు ఏ మాత్రం ఫలిస్తాయోనని.. ధర్మాన అనుచరులు తెగ టెన్షన్ పడుతున్నారంట…
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి అన్నీ తానై ఉన్న నేత మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్. ఆయన సోదరుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సహా కీలక నేతలంతా జగన్‌తో తర్వాత తర్వాత కలిసి నడిచారే తప్పా కృష్ణదాస్‌లా మొదటి నుంచి వైసీపీలో లేరు. అలాంటి నేత ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నారు. అవసమైతే సలహాదారుడిగా ఉండి పార్టీని ముందుకు నడిపించాలని అనుకుంటున్నారట. నరసన్నపేట నుంచి తన కుమారుడి కృష్ణ చైతన్యను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారంట.
నిజానికి గత ఎన్నికల్లోనే కృష్ణ చైతన్య పొలిటికల్ ఎంట్రీ గ్రాండ్ గా ఉంటుందని ధర్మాన అభిమానులు భావించారు. కృష్ణదాస్ కూడా ఇదే ప్రపోజల్ జగన్ ముందు పెట్టారు. అయితే.. నరసన్నపేటలో కొత్త ఫేస్‌తో ఎన్నికలకు వెళ్లడానికి వైసీపీ అధ్యక్షుడు జగన్ సాహసం చేయలేదు. ఈ సారి మీరే పోటీ చేయండి.. 2029లో చైతన్య గురించి ఆలోచిద్దామని జగన్ చెప్పడంతో కృష్ణదాస్ ఒప్పుకోవాల్సి వచ్చిందని టాక్. ఎలాగు అధినేత దృష్టిలో ఉన్నాం కనుక దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలని ఇప్పుడు అనుకుంటున్నారు కృష్ణదాస్.
జగన్ కూడా తన టీంతో నరసన్నపేట నియోజకవర్గంపై ఓ సర్వే చేయనున్నారని తెలుస్తోంది. కృష్ణచైతన్యకు నియోజవర్గంలో ఫాలోయింగ్ ఉందా? ఎన్నికల్లో పోటీ చేసి నిలబడగలరా? క్యాడర్ ను కలుపుకొని వెళ్లగలరా అనే అంశాలపై కార్యకర్తలు, ప్రజల నుంచి రాబోయే రియాక్షన్ బట్టి టికెట్ జూనియర్ ధర్మానకు ఇవ్వాలా వద్దా అని వైసీపీ అధ్యక్షుడు నిర్ణయిస్తారట. ఒకవేళ కొడుకుకు నెగటివ్ గా ప్రజాభిప్రాయం ఉంటే మరోసారి తండ్రికే టికెట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా నరసన్నపేట టికెట్ మాత్రం ధర్మాన ఫ్యామిలీలోనే ఉంటుందంటున్నారు. కానీ, తాను బలంగా ఉన్నపుడే కొడుకు భవిష్యత్ ఫిక్స్ చేయాలని కృష్ణదాస్ ఆరాట పడుతున్నారంట.
జగన్ టీం సర్వే చేసే నాటికి కొడుకు పేరు నియోజకవర్గంలో అలవాటు అయిపోవాలని ప్లాన్ వేశారు సీనియర్ ధర్మాన. అందుకే కార్యకర్తలతో కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయ్యప్పమాలలో ఉన్న చైతన్య ఈ 40 రోజులు ఫ్యామిలీకి దూరంగా కార్యకర్తలకు దగ్గరగా ఉండాలని నిర్ణయించారట. మరి ఇంతగా ఆరాటపడుతున్న కృష్ణదాస్ శ్రమ ఫలిస్తుందో? లేదో? కృష్ణచైతన్య పాలిటికల్‌గా ఏ మాత్రం సక్సెస్ అవుతారో చూడాలి?
Story by Big Tv