మృత్యువు ఎప్పుడు ముంచుకొస్తుందో తెలియదు. చావు ఎలా వెంటాడుతుందో.. మన ఊహకు కూడా అందదు. కర్నూలు జిల్లా చిన్న టేకూరు దగ్గర జరిగిన బస్సు ప్రమాదం కూడా అలాంటి విషాదమే! ఎమర్జెన్సీ విండో ఓపెన్ చేసి బయటపడేలోపే.. 19 మంది యమపాశానికి బలైపోయారు. అసలు.. ట్రావెల్స్ బస్సుల్లో ప్రాణాలకు గ్యారంటీ ఉందా?
కొన్ని ప్రమాదాలు ఊహకు అందవు. కొన్ని విషాదాలు అంతుబట్టవు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం కూడా అలాంటిదే! పడుకున్న వాళ్లు పడుకున్నట్టే పోయారు. ఇంకొందరు అగ్ని ప్రమాదం నుంచి తేరుకునేలోపే.. మృత్యుఒడిలోకి జారిపోయారు. కేవలం.. కొందరు మాత్రమే.. సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో.. ఇద్దరు డ్రైవర్లతో కలిపి బస్సులో మొత్తం 43 మంది ఉన్నారు. ఈ ఘోర ప్రమాదంలో.. 19 మంది ప్రయాణికులతో పాటు బైక్‌పై ఉన్న శివశంకర్ కూడా చనిపోయాడు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉండటం అందరినీ కలచివేస్తోంది. ప్రమాదం నుంచి 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో.. ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు.. శుక్రవారం తెల్లవారు జామున 3 గంటల తర్వాత కర్నూలు శివారులోని చిన్నటేకూరు దగ్గర ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న బైక్‌ని వేగంగా ఢీకొట్టడంతో.. ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు ఢీకొన్న తర్వాత.. బైక్ బస్సు కిందకు చొచ్చుకుపోయింది. అలాగే.. బస్సు దానిని 300 మీటర్లు లాక్కెళ్లిపోవడంతో.. బైక్‌పై ఉన్న శివశంకర్ కూడా చనిపోయారు. అదే సమయంలో.. బైక్‌లోని పెట్రోల్ లీక్ అవడంతో.. బస్సు ఇంజిన్ కింద ఒక్కసారిగా మంటలు చెలరేగి.. ఫ్యూయల్ ట్యాంకుకు వ్యాపించాయి.
వెంటనే.. బస్సు డ్రైవర్ ప్రయాణికులను నిద్ర లేపి.. బస్సులో నుంచి దిగిపొమ్మని చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఆ డ్రైవర్ కేవలం.. మరో డ్రైవర్‌ని మాత్రమే నిద్ర లేపి.. ప్రమాదం గురించి అలర్ట్ చేసినట్లు తెలుస్తోంది.దాంతో..గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు మంటల నుంచి తేరుకునేందుకు కాస్త టైమ్ పట్టింది. కొందరు తేరుకొని.. హాహాకారాలు చేస్తూ, అద్దాలు పగలగొట్టుకొని బయటపడ్డారు. ఇంకొందరు మంటల్లోనే చిక్కుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చిందని.. హఠాత్తుగా లేచి చూడగానే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయని, పెద్ద ఎత్తున పొగ కమ్మేసిందని.. ప్రమాదం నుంచి బయటపడిన వారు చెబుతున్నారు. వెంటనే.. కొందరు బస్సు అద్దాలు పగలగొట్టి బయటకు దూకేశారు. రోడ్డుపై వెళ్తున్న కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన వారిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. మంటల్లో.. బస్సూ పూర్తిగా కాలిపోయింది. బస్సులో ప్రయాణించిన వారిలో.. ఎక్కువ మంది హైదరాబాద్‌కు చెందిన వారే ఉన్నారు. బస్సు ఢీకొట్టిన బైక్‌పై ఉన్న శివశంకర్.. కర్నూలు మండలం ప్రజానగర్‌కు చెందినవాడిగా నిర్ధారించారు.
బస్సులో మంటలు చెలరేగిన తర్వాత.. బస్సు డోర్ తెరుచుకోకపోవడం కూడా ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడానికి కారణంగా తెలుస్తోంది. బస్సు ఇంజిన్‌కు.. మంటలు వ్యాపించి వైర్లు కాలిపోవడంతో.. డోర్స్‌కి సంబంధించిన హైడ్రాలిక్ సిస్టమ్ పాడైనట్లు తెలుస్తోంది. దీనివల్ల.. బస్సు తలుపు తెరచుకోకపోవడంతో.. కొందరు ప్రయాణికులు బయటకు వచ్చేందుకు వీల్లేక చనిపోయారు. గాయపడినవారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఒక్క ప్రమాదం.. అనేక కుటుంబాల్లో తీరన్ని విషాదాన్ని నింపింది. మృతి చెందిన వారిలో దీపావళి పండగకు వచ్చి.. తిరిగి బెంగళూరు వెళ్తున్న వారున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఉన్నారు. తల్లీకొడుకులు ఉన్నారు. ఎన్నో ఆశలతో బతుకుతున్న కుటుంబాలున్నాయి. బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలకు డీఎన్ఏ టెస్టులు జరుపుతున్నారు. వాటి రిజల్ట్స్ రావడానికి రెండు రోజుల సమయం పడుతుంది. డీఎన్ఏ టెస్టుల రిపోర్టులు వచ్చిన తర్వాత.. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని.. కర్నూలు కలెక్టర్ సిరి తెలిపారు.
బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు.. తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో చనిపోయిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల ఆర్థికసాయం అందించనున్నారు. అదేవిధంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని.. మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ప్రధాని మోడీ కూడా బస్సు ప్రమాదం బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, గాయపడినవారికి 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబు.. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. మృతులను గుర్తించి.. వారి కుటుంబాలకు తక్షణసాయం అందించాలన్నారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమని తేలితే.. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తనిఖీలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
ఇదే NH-44పై.. గతంలో పాలెం దగ్గర ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అప్పుడు పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలోనూ.. బస్సులో ఉన్నవారిలో 19 మంది చనిపోయారు. ఇది.. కేవలం నిర్లక్ష్యం వల్లే జరిగిందా? వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సుకు అన్ని అనుమతులూ ఉన్నాయా? చిన్నటేకూరు బస్సు ప్రమాదంలో ఎవరి పాపమెంత? ఈ నష్టాన్ని పూడ్చేదెవరు?
వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగిన తర్వాత.. ఇప్పుడు నడుస్తున్న చర్చ ఒకటే. నిర్లక్ష్యమే.. ఈ విషాదానికి కారణమా? సరైన జాగ్రత్తలు పాటించి ఉంటే.. మృతుల సంఖ్య ఇంకా తగ్గి ఉండేదా? అనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రమాదానికి గురైన బస్సుపై.. తెలంగాణలో 16 చలాన్లు ఉన్నాయి. హైస్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘనలపైనా చలాన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బస్సు.. డయ్యు,డామన్ రిజిస్ట్రేషన్‌తో ఉంది. బస్సు ఫిట్‌గానే ఉందని.. బైక్‌ని ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు చెలరేగాయని అధికారులు చెబుతున్నారు.
ఈ తరహా ప్రమాదాలు.. ఎక్కువగా స్లీపర్ బస్సుల్లోనే జరుగుతున్నాయనేది కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. ఇదే నెలలో రాజస్థాన్‌లో ఇదే తరహా ప్రమాదం జరిగి.. 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కొన్నేళ్ల క్రితం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పాలెం దగ్గర జరిగిన బస్సు ప్రమాదాన్ని.. తెలుగు వాళ్లెవరూ ఇంకా మర్చిపోలేదు. ఇవే కాదు.. కొన్నేళ్లుగా స్లీపర్ బస్సుల్లో జరుగుతున్న ప్రమాద ఘటనలు.. ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయ్. వీటి నిర్వహణ కోసం కఠిన నిబంధనలు తీసుకురావాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయ్. ఈ ప్రమాదాలకు డిజైన్ లోపమే కారణమా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. సాధారణంగా.. స్లీపర్ బస్సుల్లో 30 నుంచి 36 బెర్త్‌లు ఉంటాయి. అదే.. మల్టీ యాక్సిల్ బస్సులైతే.. 40 మంది వరకు ప్రయాణించొచ్చు. ఒక్కో బెర్త్.. ఆరడుగుల పొడవు, 2.6 అడుగుల వెడల్పుతో ఉంటుంది. అయితే.. ఈ బెర్త్‌లను లింక్ చేసే గ్యాలరీతో సమస్య వస్తోందని చెబుతున్నారు. ఈ గ్యాలరీలు చాలా ఇరుగ్గా ఉండటంతో.. కేవలం ఒక వ్యక్తి మాత్రమే వెళ్లడానికి వీలుంటుంది. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు.. అందులో ప్రయాణించేవారు ఈ ఇరుకైన గ్యాలరీ నుంచి వేగంగా బయటపడలేకపోతున్నారు.
స్లీపర్ బస్సుల్లో ప్రయాణం సౌకర్యవంతంగానే ఉంటున్నా.. సీట్ల మధ్యలో తక్కువ స్థలం వల్ల ప్రయాణికుల కదలికలకు తీవ్ర ఇబ్బందిగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్లే.. ప్రమాదం జరిగినప్పుడు.. ఎక్కువమంది లోపల చిక్కుకుపోతున్నారని అంటున్నారు. స్లీపర్ బస్సుల హైట్ కూడా మరో సమస్యగా మారుతోంది. సాధారణంగా వీటి ఎత్తు 8 నుంచి 9 అడుగుల వరకు ఉంటోంది. బస్సు ఉన్నట్టుండి ఓ వైపుకి ఒరిగినప్పుడు.. ప్రయాణికులు కిటికీలను, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లను చేరడం కష్టమవుతోంది. ఈ ఎత్తువ ల్ల.. రెస్క్యూ ఆపరేషన్‌కి కూడా ఆటంకం కలుగుతోంది. ప్రమాదం జరిగినప్పుడు.. అందులో ఉన్నవాళ్లను బయటకు తీసేలోపే.. మృతుల సంఖ్య పెరుగుతోందని భావిస్తున్నారు. స్లీపర్ బస్సుల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు.. మొదటి రెండు నిమిషాల్లో స్పందించే తీరే అత్యంత కీలకం. అయితే.. వీటిలో ప్రయాణించే వారు ఎక్కువగా నిద్రలోనే ఉంటారు. ప్రమాదం జరిగే సమయానికి వెంటనే తేరుకున్న వారే ప్రాణాలతో.. బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఇక.. అప్పర్ బెర్తుల్లో ఉన్నవారు బయటపడటం చాలా కష్టంగా ఉంటుంది.
ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో.. మంటలు వ్యాపించినప్పుడు అద్దం పగలగొట్టేందుకు అందులో ఉన్నవారు ఎంతో ప్రయత్నించారు. కానీ.. చాలా మంది ఎమర్జెన్సీ విండో దగ్గరకు చేరుకోలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో.. అద్దాలు పగలగొట్టేందుకు అవసరమయ్యే సుత్తి కూడా రెండు, మూడు బెర్తులకొకటి పెట్టారు. ఆ సమయంలో.. వాటిని వెతుక్కొని, అద్దం పగలగొట్టి బయటకు వచ్చేంత సమయం ఉండదు. కాబట్టి.. కొందరు మాత్రమే సురక్షితంగా బయటపడగలిగారు. ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా.. బస్సు బయల్దేరడానికి ముందే.. ఓ చెక్ లిస్ట్ సిద్ధం చేసుకొని.. అన్ని సరిగ్గా ఉన్నాయో లేవో పరిశీలించాకే.. బస్సుని నడపాలని కొందరు సూచిస్తున్నారు. డ్రైవర్లు కూడా ఓవర్ స్పీడ్‌తో వెహికిల్ నడపకుండా చూసుకోవాలి. రాత్రివేళల్లో నిద్రమత్తులోకి జారకుండా ఉండాలి. ప్రతి విండో దగ్గర.. అద్దం పగలగొట్టేందుకు అవసరమయ్యే పరికరాన్ని ఉంచాలి. ప్రయాణికులంతా బస్సు ఎక్కిన తర్వాత.. ఏదైనా ప్రమాదం జరిగితే.. ఎలా బయటపడాలన్న దానిపై 2 నిమిషాలు అవగాహన కల్పించాలి. అప్పుడు మాత్రమే.. ఇలాంటి ఘోర యాక్సిడెంట్లు జరిగినప్పుడు.. మృతుల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.
Story by Big Tv