Vizag: భార్య, భర్తల మధ్య గొడవలు కామన్. కానీ కొన్నిసార్లు క్షణికావేశాల్లో చేసే పొరపాట్ల వల్ల తమ తమ జీవితాలను కోల్పోవాల్సి వస్తోంది. ఈ మధ్య భార్య భర్తల గొడవల కేసులు తరచుగా చూస్తునే ఉన్నాం. సినిమా ఆర్టిస్టులు, డ్యాన్సర్స్ ఇండస్ట్రీలో తమ కెరీర్‌ను సాగించాలని ఎన్నో కలలతో అడుగుపెడుతుంటారు. కానీ కొందరి జీవితాల అర్థాంతరంగా ముగిసిపోతున్నాయి. తాజాగా భర్త కొట్టడంతో డ్యాన్సర్ మృతి చెందిన ఘటన వైజాగ్‌లో చోటు చేసుకుంది. దీంతో.. టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైజాగ్ డాన్సర్స్ అసోసియేషన్లో భర్త బంగార్రాజు, మృతురాలు రమాదేవి ఇద్దరు డ్యాన్సర్స్‌గా పని చేస్తున్నారు. ఇద్దరు కలిసి మాధవధారలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. అయితే.. ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు రావడంతో, అల్లిపురం వెంకటేశ్వర మెట్టు వద్ద తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది మృతురాలు రమాదేవి. దీంతో.. మూడు రోజుల క్రితం బంగార్రాజు అత్తగారి ఇంటికి అల్లిపురం వెళ్లి భార్య రమాదేవితో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో జరిగిన గొడవలో.. భర్త బంగార్రాజు కొట్టడంతో పక్కనే ఉన్న కరెంట్ పోల్‌కి రమాదేవి తల తగిలి గాయాల పాలైంది. తల భాగానికి గాయం కావడంతో, కేజీహెచ్‌కి తరలించారు. అయితే.. KGH లో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. దీంతో.. భర్త పైన కేసు నమోదు చేసి టూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.