Nobel Prize 2025 Medicine: రోగ నిరోధక వ్యవస్థకు పరిశోధనలకు నోబెల్ వరించింది. మేరీ ఇ.బ్రంకో, ఫ్రెడ్ రామ్స్‌డెల్, షిమన్ సకగుచీలకు ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం దక్కింది. స్వీడన్‌లోని స్టాక్‌హోంలోని నోబెల్ బృందం ఈ మేరకు ప్రకటన చేసింది. మేరీ ఇ.బ్రంకో, ఫ్రెడ్ రామ్స్‌డెల్ అమెరికాకు చెందినవారు కాగా సకగుచీ జపాన్‌కు చెందిన శాస్త్రవేత్త. ఈ ముగ్గురికి వైద్య విభాగంలో నోబెల్ దక్కింది.
2025లో ఫిజియాలజీ లేదా మెడిసిన్‌లో నోబెల్ బహుమతిని మేరీ ఇ. బ్రంకో, ఫ్రెడ్ రామ్స్‌డెల్, షిమోన్ సకగుచీలకు.. రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన ఆవిష్కరణలకు అందించనున్నారు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ దాని సొంత కణజాలాలపై దాడి చేయకుండా ఎలా నిరోధిస్తుందనే దానిపై వీరు పరిశోధనలు చేశారు. శక్తిమంతమైన రోగనిరోధక వ్యవస్థకు నియంత్రణ తప్పనిసరి లేకుంటే సొంత అవయవాలపై దాడి చేసే అవకాశం ఉంది.
రోగనిరోధక వ్యవస్థను నిరోధించే ‘పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్’కు సంబంధించిన ఆవిష్కరణలకు గానూ ఈ ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది. రోగనిరోధక కణాలు సొంత శరీరంపై దాడి చేయకుండా అడ్డుకునే ‘రెగ్యులేటరీ టీ సెల్స్’ను ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు గుర్తించారు. రోగనిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఎందుకు రావో అర్థం చేసుకునేందుకు ఆవిష్కరణలు దోహదపడతాయని నోబెల్ కమిటీ ఛైర్మన్ పేర్కొన్నారు.
హానికరమైన రోగనిరోధక కణాల తొలగింపును సెంట్రల్ టాలరెన్స్ అని పిలుస్తారు. సకగుచీ 1995లో రోగనిరోధక వ్యవస్థ ఆటో ఇమ్యూన్ దాడులను నివారించడానికి ప్రత్యేక తరగతి కణాలపై ఆధారపడుతుందని తెలిపారు. 2001లో బ్రంకో, రామ్స్‌డెల్ చేసిన తదుపరి పరిశోధనలు టీ కణాల అభివృద్ధిని నియంత్రించే ఫాక్స్‌ప్ 3 జన్యువులోని పరివర్తనలు మానవులలో IPEX సిండ్రోమ్ వంటి తీవ్రమైన వ్యాధులను ఎలా ప్రేరేపిస్తాయో కనుగొన్నాయి.
సకగుచీ పరిశోధనలను ఫాక్స్‌పి3 మొదట గుర్తించిన కణాల ప్రధాన నియంత్రకం అని నిరూపించారు. రోగనిరోధక వ్యవస్థ శరీరంలోని సొంత అవయవాలకు వ్యతిరేకంగా పనిచేయకుండా నిరోధించడంలో వాటి పాత్రను నిర్ధారించారు.
ఈ పరిశోధనలు రోగనిరోధక నియంత్రణపై అవగాహనను పెంచడమే కాకుండా క్యాన్సర్, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, అవయవ మార్పిడి చికిత్సలకు కూడా అవకాశం కల్పించింది. వీటిలో చాలా వరకు ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయి.
నోబెల్ కమిటీ చైర్మన్ ఒల్లె కాంపే మాట్లాడుతూ.. “రోగనిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, తీవ్రమైన ఆటో ఇమ్యూన్ వ్యాధులను ఎలా ఎదుర్కొంటుందో అవగాహనకు ఈ ఆవిష్కరణలు నిర్ణయాత్మకంగా ఉన్నాయి” అని తెలిపారు.