Telangana Jagruthi: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మరో నేత.. తెలంగాణ జాగృతిలో చేరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నంగవత్ రాజేశ్ నాయక్, సోమవారం తెలంగాణ జాగృతిలో చేరికయ్యారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ జాగృతి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో.. అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆయనకు కండువా కప్పి స్వాగతం పలికారు.
కవిత ఆహ్వానం
తెలంగాణ ఉద్యమంలో కలిసి పని చేసిన రాజేశ్ నాయక్ జాగృతిలో చేరడం ఆనందంగా ఉందని.. ఉద్యమకారులమంతా కలిసి సామాజిక తెలంగాణ సాధనకు పాటుపడదామని కవిత పిలుపునిచ్చారు.
రాజేశ్ నాయక్ స్పందన
రాజేశ్ నాయక్ స్పందిస్తూ.. కవిత అక్క పిలపు మేరకు తెలంగాణ జాగృతిలో చేరానని చెప్పారు.. తెలంగాణ ఉద్యమకారుల పునరేకీకరణ జరగాలని అక్క పిలుపునివ్వడంతో జాగృతిలో చేరాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఆమె ఇచ్చిన పిలుపు ఎంతో ప్రేరణ కలిగించింది. ఉద్యమం నడిపిన మన అందరం ఇప్పుడు సామాజిక తెలంగాణ కోసం మళ్లీ కలవాలి అని అన్నారు.
బీఆర్ఎస్‌పై అసంతృప్తి
తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లకు గురై ఆస్తులు అమ్ముకొని ఉద్యమంలో పని చేశానని.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదన్నారు.. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలను ప్రోత్సహిస్తుండటంతోనే బీఆర్ఎస్ ను వీడి తెలంగాణ జాగృతిలో చేరుతున్నానని చెప్పారు.
కార్యక్రమంలో పాల్గొన్న నేతలు
ఈ కార్యక్రమంలో జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ నాయక్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, నాయకులు ఇస్మాయిల్, సంపత్ గౌడ్, కోళ్ల శ్రీనివాస్, శ్రీకాంత్ గౌడ్, పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరంతా రాజేశ్ నాయక్ చేరికను స్వాగతిస్తూ, ఇది జాగృతి బలోపేతానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
Also Read: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..
సామాజిక తెలంగాణ కోసం పునఃప్రయాణం
జాగృతిలో రాజేశ్ నాయక్ చేరికతో.. తెలంగాణ ఉద్యమకారుల్లో కొత్త చైతన్యం నెలకొంది. ఉద్యమ దశలో కలిసిన స్ఫూర్తిని మళ్లీ ప్రదర్శించేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు. ఉద్యమం కేవలం ఒక రాజకీయ లక్ష్యం కాదు, ఇది తెలంగాణ సమాజ మార్పు కోసం పిలుపు అని కవిత వ్యాఖ్యానించారు.