Deputy cm Pawan Kalyan: ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతిపై శాసనసభలో క్లారిటీ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. పనుల్లో దాదాపు 250 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని సభ్యులు చెబుతున్నారని, ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ప్రస్తుతానికి 75 లక్షల పైచిలుకు నిధులు రికవరీ చేశామన్నారు. అవినీతికి పాల్పడిన వారిని పక్కన పెట్టేశామన్నారు.
ఉపాధి హామీ అవకతవకలపై
సోమవారం శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే ఉపాధి హామీ పథకం అవినీతిపై పలువురు సభ్యులు లేవనెత్తారు. ఈ స్కీమ్‌లో అవినీతి మాటేంటి? ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ చేశారు. దీనిపై డిప్యూటీ సీఎం, పంచాయితీ రాజ్ శాఖమంత్రి పవన్ కల్యాణ్ సుధీర్ఘంగా వివరణ ఇచ్చారు.
లోకం మాధవి మాట్లాడుతూ.. ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్స్, ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ ముగ్గురు ఒక గ్రూపుగా ఏర్పడి కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడినట్టు సభ దృష్టికి తెచ్చారు. అలాగే జాబ్ కార్డు అవకతవకలు, సోషల్ ఆడిట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అసలైన పేద వారికి పనులు లభించడం లేదన్నారు.
కొలికపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మా నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందన్నారు. 42 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు అవినీతికి పాల్పడినట్టు ప్రజలు ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై శాఖపరమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ALSO READ: ఏపీలో నేతల ఆటల పోటీలు, 12 రకాల గేమ్స్
డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు మాట్లాడుతూ .. జిల్లాల విభజన సమయంలో ఉపాధి హామీ పథకం పనులకు కొన్ని సమస్యలు ఏర్పడ్డాయన్నారు. కొన్ని జిల్లాలకు ఎక్కువగా, మరికొన్నింటికి తక్కువగా హామీ పనులు రావడం మొదలైందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని సూచన చేశారు.
డిప్యూటీ సీఎం వివరణ
చివరకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకం దుర్వినియోగం జరిగినట్టు ఫిర్యాదు అందింది. ఇందులో ఫీల్డ్ అసిస్టెంట్లు కీలక పాత్ర పోషించినట్టు తేలిందన్నారు. వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేశామన్నారు. 25 మండలాలకు గాను 16 మండలాల్లో అక్రమాలు జరిగాయి.
వివిధ స్థాయిల వారి నుంచి దాదాపు 520 మందిని గుర్తించారు. అందులో 31 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, కొంతమంది సీనియర్ ఉద్యోగులు ఉన్నట్లు తేలిందన్నారు. మిగతా వారిపై విచారణ జరుగుతోందన్నారు. ఉపాధి హామీ పథకంలో అవినీతి జరగకుండా నిలువరించాల్సిన వ్యక్తులు అవినీతి పాల్పడ్డారని గుర్తు చేశారు. అందుకే చాలామందిని పక్కన పెట్టామన్నారు.
సోషల్ ఆడిట్, విజిలెన్స్, క్వాలిటీ కంట్రోల్ స్థాయిలో సరైన అధికారులను నియమించామన్నారు డిప్యూటీ సీఎం. ప్రస్తుతం 526 మండలాల్లో సోషల్ ఆడిట్ చేశామన్నారు. మరి కొన్నింటిని ఈనెల చివరి నాటికి పూర్తి కానుందన్నారు. పథకంలో అవినీతి జరిగిందని సభ్యులు చెబుతున్నారని, అక్కడా ఆధారాలు లభించలేదన్నారు.
కొద్ది మొత్తంలో నిధులు రికవరీ చేశామన్నారు. కొత్త జిల్లాలు రేషియాను బట్టి పరిశీలిస్తామన్నారు. జంగిల్స్ క్లియరెన్స్ విషయంలో ముఖ్యమంత్రితో మాట్లాడతామని గుర్తు చేశారు. ఉపాధి హామీ పనుల విషయంలో పలుమార్లు కేంద్రమంత్రులతో సమావేశమైన విషయాన్ని గుర్తు చేశారు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్.