Vijayawada: వారు పోలీస్ ఉన్నతాధికారులు.. విధుల తర్వాత విశ్రాంతి కోసం వారికి కొంత సమయం చిక్కింది. ఇంకేముంది పేకాట ఆడారు.. తీరా చూస్తే వారు పేకాట ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనితో పోలీస్ అధికారులు ఖంగుతిన్నారు. ఈ ఘటన ఏపీలోని విజయవాడలో సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిలో దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సంధర్భంగా శ్రీ కనకదుర్గ భవానీ అమ్మవారిని దర్శించుకొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. అయితే భక్తుల రద్దీ నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాల పోలీస్ అధికారులు, సిబ్బందిని బందోబస్తు విధులకు కేటాయించారు. కాగా వీరికి ఇంద్రకీలాద్రి సమీపంలోని పలు హోటళ్లలో బస ఏర్పాటు చేశారు అధికారులు.
కాగా వీరు బస చేసిన హోటల్ లో నలుగురు సీఐలు పేకాట ఆడినట్లుగా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విధులకు వచ్చిన పోలీస్ అధికారులు.. సరదాగా పేకాట ఆడారని భావించినా.. వీడియో వైరల్ కావడం పోలీస్ శాఖలోనే చర్చకు దారి తీసింది. ఈ వీడియోలో విజయవాడ టూ టౌన్ సిఐ కొండలరావు, పెనుకొండ సిఐ రాయుడులు ఉన్నట్లు భావిస్తున్నా.. మరో ఇద్దరు అధికారుల పేర్లు తెలియరాలేదు.
అయితే పోలీస్ అధికారుల పేకాట వీడియో వైరల్ పై పోలీస్ శాఖ అంతర్గత విచారణ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ వీడియో ఇప్పుడు తీశారా.. లేక ప్రస్తుతం జరుగుతున్న దసరా శరన్నవరాత్రుల బందోబస్తు కోసం వచ్చి, పేకాట ఆడారా.. లేక పాత వీడియోనా అనేది తేలాల్సి ఉంది. ఏదిఏమైనా పేకాట వీడియో మాత్రం వైరల్ కాగా.. కొందరు ఇదేమి పని సార్.. పేకాటరాయుళ్లను పట్టుకోవాల్సిన మీరే.. ఇలా పేకాట ఆడితే కరెక్ట్ కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: TG Politics: బాబును కలిసిన తీగల, మల్లారెడ్డి.. టీడీపీలోకి అంటూ పొలిటికల్ బాంబ్.. కానీ..
సరదాగా వారు ఆడిన పేకాట వీడియోను అసలు తీసింది ఎవరో కూడా తెలుసుకొనే పనిలో పోలీస్ శాఖ ఉన్నట్లు సమాచారం. ఇటువంటి ఘటనలు పోలీస్ శాఖ ప్రతిష్టను మసకబారేలా చేస్తాయని, భాద్యతాయుతమైన అధికారులుగా ఉన్న వీరు ఇలా పేకాట ఆడటం ఏమిటన్న చర్చలు కూడా సాగుతున్నాయి. ఏదిఏమైనా అసలు వైరల్ వీడియో నిజమా కాదా.. ఓల్డ్ వీడియోనా.. లేక మార్ఫింగ్ చేశారా.. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియాలంటే పోలీస్ శాఖ నుండి ప్రకటన విడుదల కావాల్సి ఉంది.