CM Chandrababu: అనంతపురం ఐసీడీఎస్ శిశు సంరక్షణ కేంద్రంలో పసిబిడ్డ మృతి చెందాడు. ఆయా నిర్లక్ష్యం కారణంగానే నవజాత శిశువు మృతి చెందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దసరా రోజున సెలవివ్వలేదని విధుల్లో ఉన్న ఆయా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ఆకలితో శిశువు మృతి చెందిందని ఆరోపణలు ఉన్నాయి. అయితే అనారోగ్యంగా పనికందు మరణించాడని ఐసీడీఎస్ అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా స్మశానంలో పూడ్చడంపై అనుమానాలకు తావిస్తున్నాయి.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థినులు పచ్చకామెర్లతో ఆసుపత్రి పాలయ్యారు. పచ్చకామెర్ల వ్యాధి 5% కంటే ఎక్కువ ఉన్న విద్యార్థినులు 36 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో 120 మంది విద్యార్థినులు చికిత్స పొందుతున్నారు. హాస్టల్ నీటిలో ఎటువంటి సమస్య లేదని ప్రిన్సిపాల్ చెబుతున్నారు.
కురుపాం గిరిజన బాలికల గురుకులంలో విద్యార్థులకు అస్వస్థతపై మంత్రి సంధ్యారాణితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. పదుల సంఖ్యలో విద్యార్థులు అనారోగ్యం పాలైన ఘటనపై అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను మంత్రి సంధ్యారాణి పరామర్శించనున్నారు. పార్వతీపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని కలెక్టర్, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
అనంతపురంలో శిశు సంరక్షణ కేంద్రంలో పసిబిడ్డ మృతిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. కురుపాం, అనంతపురం ఘటనలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.
అనంతపురంలో పసిబిడ్డ మృతిపై విచారణకు ఆదేశించామని గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పసికందు మృతిపై మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పసిబిడ్డ మృతికి ఆనారోగ్యమే కారణమని అధికారులు చెబుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ చేయాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. శిశువు మరణానికి సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యం కారణమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read: Auto Drivers Sevalo: ఆటో డ్రైవర్ల సేవలో.. జగన్ కోలుకోవడం కష్టం
అనంతపురం శిశుగృహంలో పసికందు మృతి బాధాకరమని కలెక్టర్ ఆనంద్ అన్నారు. ఈ ఘటనపై త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. కమిటీలో డీఎంహెచ్ఓ డా.ఈబి.దేవీ, ఐసీడీఎస్ పీడీ నాగమణి, జీజీహెచ్ పీడియాట్రిక్ హెచ్ఓడీ సభ్యులుగా త్రీమెన్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. త్రీమెన్ కమిటీ విచారణ చేసి సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించామన్నారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు ఉంటాయని చెప్పారు.