Godavari : గోదావరి ఉగ్రరూపానికి లంక గ్రామాలు విలవిలలాడుతున్నాయి. అయితే భద్రాచలం వద్ద గోదారమ్మ కాస్త శాంతించింది. నీటిమట్టం 52.60 అడుగులకు చేరుకుంది. దీంతో మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. అయితే తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ఇంకా ఉద్ధృతంగానే ప్రవహిస్తోంది. అక్కడ నీటిమట్టం 15.50 అడుగులుగా ఉంది.
వరద ప్రభావంతో కోనసీమ జిల్లాలోని 25 లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో లంకగ్రామాల వాసులు నాటు, మర పడవల్లో రాకపోకలు కొనసాగిస్తున్నారు. పి.గన్నవరం మండలంలోని జొన్నలంక, కె.ఏనుగుపల్లి లంక, శివాయలంకలో ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. యానాం బాలయోగి వారధి వద్ద వరద ప్రవాహం పెరిగింది.
ఐ.పోలవరం మండలంలోని కొన్ని గ్రామాలు జలదిగ్భందంలో ఉన్నాయి. పాత ఇంజరం వద్ద స్లూయిజ్ లీక్ తో గ్రామంలోకి వరద వచ్చి చేరింది. దీంతో పంటలు నీట మునిగాయి. మురవళ్ల రాఘవేంద్ర వారధి వద్ద ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి, ఆచంట మండలాల్లోని 16 లంక గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. యలమంచిలి మండలం కనకాయలంక కాజ్‌వే నీట మునిగింది.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో గోదావరి, శబరి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంత చింతూరు, వరరామచంద్రాపురం, కూనవరం మండలాల్లోని 115 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 5 రోజులుగా ఏపీ, తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.
చట్టి, సింగన్నగూడెం గ్రామాల మధ్య ప్రధాన రహదారి.. చింతూరు నుంచి ఒడిశా వైపు వెళ్లే హైవేపై నిమ్మలగూడెం, కుయ్యుగూరు మధ్య వరద చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం, వరరామచంద్రాపురం మండలాల మధ్య శబరి నదిపై ఉన్న వంతెన మునిగిపోయింది. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లోకి 20 వేల మంది వరద బాధితులు ఆశ్రయం పొందుతున్నారు.