Revanth reddy fires on CM KCR(Political news today telangana) : బీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని మండిపడ్డారు. పాలమూరు జిల్లాను అద్దంలా మారుస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. 9 ఏళ్ల పాలనలో ఆ జిల్లాకు చేసిందేమి లేదన్నారు. పాలమూరు జిల్లా కేసీఆర్ చేతిలో మోసపోయిందని తెలిపారు. భూములు, ఇసుక, గనులు , మద్యం ఇలా ఏ దందాలో చూసినా బీఆర్ఎస్ నేతలే ఉన్నారని ఆరోపించారు.
పాలమూరు జిల్లాకు చెందిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ భూకబ్జాలకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. వక్ఫ్ భూములను కూడా వదలడం లేదన్నారు. బీఆర్ఎస్ నేతల అరాచకాలను ఎదిరించేందుకు ఆ జిల్లాకు చెందిన నేతలు కాంగ్రెస్‌లో చేరడం అభినందనీయమన్నారు. పార్టీలో చేరిన నాయకులకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాలోని 14 సీట్లలోనూ కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పాలనలో అలంపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి ఏమీ జరగలేదని స్పష్టం చేశారు. ఎంపీగా గెలిపిస్తే తన ఇల్లు అమ్మి అయినా సరే అభివృద్ధి చేస్తానని ఉద్యమ సమయంలో చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం జిల్లాను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్, కేటీఆర్‌కు వంద ఎకరాల ఫామ్ హౌస్‌లు ఉన్నాయని రేవంత్ అన్నారు. వేల కోట్ల ఆస్తులు, వందల ఎకరాల భూములు సంపాదించారని ఆరోపించారు. మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు.
పోలీసులు, అధికారులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరించొద్దని రేవంత్ సూచించారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే సహించేంది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు ముంపు బాధితులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేని భరోసా కల్పించారు.