Tirumala: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ముడుపులు తీసుకున్నవారి పని పట్టేందుకు సిద్ధమైంది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ. ఇప్పటికే కేసు నమోదు చేసిన ఈడీ, రేపో మాపో రంగంలోకి దిగనుంది. దీంతో వైసీపీ నేతల్లో కొత్త టెన్షన్ మొదలైంది.
తిరుమల కల్తీ నెయ్యి ఇష్యూపై ఈడీ ఫోకస్
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. ముడుపులు తీసుకున్నవారి గుట్టు బయటపెట్టేందుకు సిద్ధమైంది ఈడీ. హవాలా ద్వారా డబ్బులు చేతులు మారినట్లు తేలడంతో మనీలాండరింగ్ నిరోధక చట్టం ఇప్పటికే కేసు నమోదు చేసింది. దీంతో సిట్ ఛార్జిషీటుపై ఈడీ ఫోకస్ చేసింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగుతుందని తెలియగానే ఆనాడు కీలకంగా వ్యవహరించినవారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ కేసులో సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేపట్టింది. దీనికి సంబంధించి ఛార్జిషీటును దాఖలు చేసింది. మొత్తం 36 మంది పేర్లను అందులో ప్రస్తావించింది.
నిధుల గుట్టు తేలేనా? మరి ఫోన్ నెంబర్ మాటేంటి?
కల్తీ నెయ్యి సరఫరాలో రూ.235 కోట్ల అక్రమాలు జరిగినట్లు తేల్చింది. అందులో 20 కోట్ల రూపాయలు హవాలా ద్వారా జరిగినట్టు తేలింది. ఆ సొమ్ము తిరుపతిలోని ఓ ఇంటికి చేరినట్లు తేల్చింది. రూ.75 లక్షలు టీటీడీ డెయిరీ నిపుణుడుకి, రూ.31 లక్షలు కమిషన్ ఏజెంటు వెళ్లినట్టు పేర్కొంది.మరో రూ.19.86 కోట్లు వైష్ణవీ డెయిరీ సీఈవోకు చేరినట్లు నిర్ధారణ అయ్యింది.
ఆ డబ్బు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందనేది తేల్చనుంది. భోలేబాబా నిర్వాహకులు ఈ రాకెట్‌లో కీలకంగా మారారు. హవాలా మార్గంలో చేరిన డబ్బుని తిరిగి వైట్‌గా మార్చారట. తిరిగి ఆ నిధులను భోలేబాబా కంపెనీకే పంపించారట. హవాలా ఏజెంట్లు ఆ డబ్బును విజయవాడ, చెన్నై, హైదరాబాద్ నగరాలకు చెందిన వ్యక్తులకు పంపినట్లు తేలింది.
దీని ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. త్వరలో ముడుపుల లబ్ధిదారులు, ఏజెంట్లకు నోటీసులు జారీ చేసి విచారణ జరపనుంది. ఈ వ్యవహారంపై వైసీపీలో ఎవర్ని ఈడీ పిలుస్తుందోనన్న టెన్షన్ కొందరి నేతలను వెంటాడుతోంది. మరోవైపు వైవీ సుబ్బారెడ్డి-చిన్నప్పన్న రిలేషన్‌షిప్ గురించి కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి.
ALSO READ: అంబటి రాంబాబుకు తప్పని పోలీస్ కస్టడీ..? కోర్టు విచారణపై సర్వత్రా ఉత్కంఠ!
లడ్డూ కేసులో టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ విభాగం జీఎం సుబ్రహ్మణ్యం మొబైల్‌ని స్వాధీనం చేసుకుని సిట్, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. అందులో 95424 19999 ఫోన్ నెంబర్ ని పీఎస్ టూ ఛైర్మన్ అని సేవ్ చేసుంది. ఆ నెంబర్‌తో రెగ్యులర్‌గా కాల్స్ చేసి మాట్లాడినట్లు తేలింది. ఇంతకీ ఆ నెంబర్ ఎవరిది?
ఏపీ ప్రజల హక్కుల కోసం ప్రత్యేక హోదా సాధించే పోరాటాన్ని తాము పోరాటం కొనసాగిస్తామని ఆనాటి వైసీపీ అధినేత జగన్ 2018 మార్చి 15న ఓ ట్వీట్ చేశారు. అందులో అప్పటి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లెటర్ హెడ్‌తోపాటు నోటీసుని ట్వీట్‌కు జత చేశారు. ఆ లెటర్‌హెడ్‌పై సుబ్బారెడ్డి పేర్కొన్న నెంబర్లలో 95424 19999 ఫోన్ నెంబర్ ఉంది. 2019-23 వరకు టీటీడీ ఛైర్మన్‌గా సుబ్బారెడ్డి హయాంలో చిన్నప్పన్న ఆయనకు పీఏగా పని చేసినట్లు సిట్ పేర్కొంది. ఈ లెక్కన తిరుమల లడ్డూ వ్యవహారంలో రానున్న రోజుల్లో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.