Again Cyclone In AP: అర్నబ్ తుఫానుతో అతలాకుతలమైంది ఏపీ. తాజాగా మరొక తుఫాను గండం పొంచి వుంది. బంగాళాఖాతంలో కొత్తగా మరొక అల్పపీడనం ఏర్పడింది. రాబోయే రెండు రోజుల్లో ఏపీ తీరం వైపు కదిలే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని కారణంగా ఉత్తరాంధ్ర భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి.
బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనంగా ఏర్పడింది. అండమాన్ సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే రెండు రోజుల్లో ఇది ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదిలే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దీనివల్ల రానున్న మూడు, నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
అల్పపీడనం తుఫానుగా మారుతుందా? అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సివుంది. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు కదలవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాకపోతే కొత్తగా ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లో బలపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
దీని కారణంగా నవంబర్ 1 నుంచి 3 వరకు శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. ఇది ఏపీ తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని కారణంగా అప్పుడే శ్రీకాకుళం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ALSO READ: అర్నబ్ తుపాను తాకిడికి అతలాకుతలమైన కోనసీమ.. రైతుల కళ్లల్లో కన్నీళ్లు!
మరోవైపు అర్నబ్ తుఫాను క్రమంగా బలహీన పడింది. దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఈశాన్య తెలంగాణ ప్రాంతాల మీదుగా ఉత్తరం వైపు కదిలిన తర్వాత అల్పపీడనంగా బలహీనపడింది. ఇది ఉత్తరం వైపు కదులుతూనే ఉంది. ఉత్తర ఛత్తీస్‌గఢ్ దానిని ఆనుకుని ఉన్న వాయువ్య ఒడిశా మీదుగా మరింత బలహీనపడింది. ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఐఎమ్‌డి తెలిపింది.
దీని కారణంగా శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో అత్యధికంగా 24 సెం.మీ వర్షపాతం నమోదైంది. సోంపేట-22 సెం.మీ, పలాస, మందసల-19 సెం.మీ వర్షం కురిసింది. పశ్చిమ గోదావరిలోని తణుకు, భీమడోలు-12 సెం.మీ వర్షం నమోదైంది. శ్రీకాకుళంలోని పాతపట్నం, విజయనగరంలోని పూసపాటిరేగ, తూర్పు గోదావరిలోని దవలేశ్వరం ప్రాంతాల్లో 10 సెం.మీ చొప్పున వర్షం కురిసింది.