AP Heavy Rains: ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుపాను ఏపీ వైపూ దూసుకొస్తుందని పేర్కొంది. తుపాను ఏపీలో తీరం దాటే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. గడిచిన 3 గంటల్లో గంటకు 7 కి.మీ వేగంతో వాయుగుండం కదులుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వాయుగుండం ప్రస్తుతానికి పోర్ట్ బ్లెయిర్ కి 440 కి.మీ, విశాఖపట్నానికి 970 కి.మీ, చెన్నైకి 970 కి.మీ, కాకినాడకి 990 కి.మీ, గోపాల్‌పూర్ కి 1040 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని వెల్లడించింది.
వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ రేపటికి తీవ్ర వాయుగుండంగా, ఎల్లుండి(సోమవారం) ఉదయానికి తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం(అక్టోబర్ 28) రాత్రికి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేసింది.
తుపాను తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న నాలుగు రోజులు(అక్టోబర్ 26-29) ఏపీలోని పలు జిల్లాలపై తుపాను తీవ్ర అధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నెల 28న రాత్రికి కాకినాడ సమీపంలో తీవ్రమైన తుపాను తీరం దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
తుపాను ప్రభావంతో విశాఖ నుంచి తిరుపతి వరకూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా చేస్తుంది. హైదరాబాద్ సహా తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తుపాను ప్రభావంతో తీర ప్రాంత జిల్లాల్లో ఈ నెల 28, 29 తేదీల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. దూర ప్రాంతాలకు వెళ్లే వారు ప్రయాణాలు మానుకోవాలని కోరారు. మచిలీపట్నం, దివిసీమ, విజయవాడ, గుంటూరు, గోదావరి, ఏలూరు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.