గూగుల్ ఏఐ డేటా సెంటర్ తో పర్యావరణ ఇబ్బందులు వస్తాయని చెప్పారు మాజీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రోజుల వ్యవధిలోనే ఆయన మాట మార్చారు. జగన్ ప్రెస్ మీట్ తో ఇబ్బంది పడిన ఆయన గూగుల్ డేటా సెంటర్ ని మేం స్వాగతించాం కదా అన్నారు. అదే సమయంలో గూగుల్- అదానీ, అదానీ-గూగుల్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత కన్ఫ్యూజన్ కి వేదికగా మారాయి. పోనీ అదానీ డేటా సెంటర్ ని జగనే తెచ్చారనుకుంటే, దాని పురోగతి ఏంటనేది ప్రజలనుంచి వస్తున్న ప్రశ్న. ఇప్పుడు గూగుల్ ఏఐ డేటా సెంటర్ తో కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న వేళ, అదానీ పేరు చెప్పి క్రెడిట్ కావాలని జగన్ అడగడం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు నెటిజన్లు.
గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును స్వాగతిస్తున్నామని చెప్పినా ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. జగన్ మోహన్ రెడ్డిగారి హయాంలో వచ్చిన అదానీ డేటా సెంటర్ నే గూగుల్ డేటా సెంటర్ అంటూ ప్రచారం చేస్తోంది. దీనిపైనే వైయస్ జగన్ ప్రజలకు స్పష్టత ఇచ్చారు.
-గుడివాడ అమర్నాథ్ గారు, మాజీ మంత్రి,… pic.twitter.com/oZpflYby0e
— YSR Congress Party (@YSRCParty) October 24, 2025
జగన్ కి ఏం కావాలి?
వైజాగ్ కి గూగుల్ ఏఐ డేటా సెంటర్ రాబోతోంది. 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఒక గిగా వాట్ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న డేటా సెంటర్, ఏఐ హబ్ ఏర్పాటు కోసం గూగుల్ సంస్థతో కూటమి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సహజంగానే ప్రతిపక్ష పార్టీ ఇలాంటి ఒప్పందాలపై విమర్శలు చేస్తుంది. వైసీపీ కూడా అలాగే ఈ ఒప్పందం వల్ల ఏపీకి ఒరిగేదేమీ లేదన్నది. ఆ సమయానికి జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారు కాబట్టి ఆయన నేరుగా స్పందించలేదు, ఆయన తరపున వైసీపీ నేతలు గూగుల్ డేటా సెంటర్ పై విమర్శలు గుప్పించారు. నాటి ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ దీనివల్ల పర్యావరణ కాలుష్యం జరుగుతుందని, విదేశాలే ఈ డేటా సెంటర్ ని వద్దంటే మనవాళ్లు ఏరికోరి తెచ్చుకుంటున్నారని అన్నారు. అంటే ఆయన ఉద్దేశం ఆ డేటా సెంటర్ కి వ్యతిరేకం అనే విషయం క్లియర్ గానే ఉంది. అయితే ఆ తర్వాత జగన్ ప్రెస్ మీట్ పెట్టి.. గూగుల్ డేటా సెంటర్ కి పాజిటివ్ గా మాట్లాడారు. అసలు ఆనాడు తాను తీసుకు రావాలనుకున్న అదానీ డేటా సెంటర్ దీనికి బీజం అన్నారు. అంటే జగన్ గూగుల్ డేటా సెంటర్ ని స్వాగతించారనమాట. మరి విమర్శల సంగతేంటి అని ఆయన్ను విలేకరులు ప్రశ్నిస్తే.. ఆ ప్రశ్న విమర్శలు చేసిన వారినే అడగండి అన్నారు. అంటే గుడివాడ అమర్నాథ్ ని అన్నమాట.
87వేల కోట్లు పెట్టుబడి అదానీ పెట్టి డేటా సెంటర్ కడితే, కేంద్రం సహకారం అందిస్తే, సింగపూర్ ప్రభుత్వం నుండి సబ్సీకేబుల్ ఇస్తే, వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అదానీ డేటా సెంటర్ కు అంకురార్పణ జరిగింది. ఎప్పటి నుండో అదానీ, గూగుల్ సంస్థల మధ్య ఒప్పందం నడుస్తోంది.… pic.twitter.com/dbOfOwYrHy
— YSR Congress Party (@YSRCParty) October 24, 2025
ఇరుక్కుపోయిన గుడివాడ..
జగన్ ప్రెస్ మీట్ తో గుడివాడ ఇరుక్కుపోయారు. టీడీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ గుడివాడ వీడియోని, ఆ తర్వాత జగన్ వీడియోని ప్రసారం చేస్తూ ఇంత కన్ఫ్యూజన్ ప్రతిపక్షాన్ని ఎక్కడా చూడలేదని దుమ్మెత్తిపోస్తున్నాయి. దీంతో గుడివాడ మళ్లీ రంగంలోకి వచ్చారు. తమ పార్టీ గూగుల్ డేటా సెంటర్ ని స్వాగతించిందని, కావాలనే ఎల్లో మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పర్యావరణ కాలుష్యం జరుగుతుంది అన్నది ఆయనే, తిరిగి ఇప్పుడు స్వాగతించామంటుంది కూడా ఆయనే. రోజుల వ్యవధిలోని మాట మార్చిన గుడివాడ అమర్నాథ్ సోషల్ మీడియాకు మరోసారి దొరికిపోయారు.
డేటా సెంటర్ కి అవసరం అయిన నీళ్లు, విద్యుత్, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది.
-గుడివాడ అమర్నాథ్ గారు, మాజీ మంత్రి pic.twitter.com/wZw0di7SSq
— YSR Congress Party (@YSRCParty) October 17, 2025
వైసీపీకి భారి డ్యామేజీ..
వైసీపీ హయాంలో పరిశ్రమలను తరిమేశారనే అపవాదు ఉంది. పోనీ కొత్తగా ఏమొచ్చాయనే విషయంపై అప్పటి వైసీపీ ప్రభుత్వం కూడా పెద్దగా ప్రచారం చేసుకోలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్ రాకను గొప్పగా చెప్పుకుంటుంటే, వైసీపీకి అది నచ్చడం లేదని తెలుస్తోంది. గూగుల్ ఘనత మీది కాదు, మాదేనంటూ జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. మొదట్లో గూగుల్ ఏఐ డేటా సెంటర్ మంచిది కాదన్నారు, ఇప్పుడు మంచిదేనంటూ ఆ మంచి తనం సాధ్యమైంది తమ వల్లేనంటూ క్రెడిట్ క్లెయిమ్ చేసుకుంటున్నారు జగన్. మొత్తంగా గూగుల్ ఏఐ డేటా సెంటర్ విషయంలో వైసీపీ విమర్శలు చేసి మరీ డ్యామేజ్ ని కొని తెచ్చుకున్నట్టయింది. సైలెంట్ గా ఉన్నా సరిపోయేదని, రోజుకో మాట మారుస్తూ అనవసరంగా తిప్పలు కొని తెచ్చుకున్నామని కొంతమంది వైసీపీ నేతలే వాపోతున్నారు. ఇక సోషల్ మీడియా మాత్రం వైసీపీ నేతల వ్యాఖ్యల్ని విపరీతంగా ట్రోల్ చేస్తోంది.
Also Read: బీకామ్‌లో ఫిజిక్స్.. డేటాకు మైండ్ అప్లై చేస్తే ఏఐ, అయ్యో జగన్!