ఆక్రమణలను అరికట్టడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసల జల్లు కురిపించారు. హైడ్రా లాంటి వ్యవస్థ ఏపీతో పాటు అన్ని రాష్ట్రాలకూ అవసరమని చెప్పుకొచ్చారు. పాలకుల ముందు చూపుతో పాటు నిబద్ధత గల అధికారుల పని తీరు ఏ వ్యవస్థకైనా మంచి పేరు తీసుకువస్తాయన్నారు. భవిష్యత్ లో ప్రజలకు మేలు కలిగే అవకాశం ఉంటుందన్నారు.
ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు విజయవాడకు వెళ్లిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని పవన్ క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను పవన్ అభినందించారు. దేశంలోనే మొట్టమొదటిగా హైడ్రా రూపంలో సరికొత్త వ్యవస్థను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందన్నారు. కొత్త వ్యవస్థను తీసుకురావడమే కాకుండా.. సరైన అధికారిని నియమించడం.. అధికారాలు కట్టపెట్టడం.. పూర్తి స్వేచ్ఛతో పని చేసే అవకాశం కల్పించడం అభినందనీయం అన్నారు. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి పని చేయిస్తే, అనుకున్న ఫలితాలు అందుకునే అవకాశం ఉంటుందన్నారు.
హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ ఎంతో నిబద్ధతతో పని చేస్తున్నారని పవన్ కల్యాణ్ కితాబిచ్చారు. ఇదే దూకుడుతో ముందుకు వెళ్లాలని సూచించారు. భవిష్యత్ లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే, అన్ని వ్యవస్థలు సక్రమంగా పని చేయాలన్నారు. హైడ్రా లాంటి వ్యవస్థల కారణంగా ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలు అరికట్టడంతో పాటు ప్రజలు నిబంధనల మేరకు వ్యవహరించే అవకాశం ఉంటుందన్నారు. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా, భవిష్యత్ లో మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థ రూపకల్పన విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతానని పవన్ కల్యాణ్ తెలిపారు.
శుక్రవారం సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి @PawanKalyan ను హైడ్రా కమిషనర్ శ్రీ ఎ.వి.రంగనాథ్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. pic.twitter.com/jbHxyKT9DO
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) October 24, 2025
Read Also: ఏపీకి తుపాను ముప్పు.. రానున్న నాలుగు రోజులు అత్యంత భారీ వర్షాలు