బీహార్ ఎన్నికలు బీజేపీకి పరీక్షలా మారాయి. అధికార కూటమిగా అక్కడ ఎన్డీఏ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. అయితే ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ పై ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ కూటమిపై ఉన్న సానుకూలత బీజేపీని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. కానీ బీహార్ ఎన్నికల్లో విజయం ఎన్డీఏ కూటమిదేనంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అంతే కాదు, ఎన్డీఏ కూటమి తరపున తాను కూడా బీహార్ లో ప్రచారం చేస్తామని చెప్పారాయన. ఈ దశాబ్దం మోదీదేనని చెప్పారు చంద్రబాబు. ఎన్డీఏ ప్రగతిశీల ప్రభుత్వమని అభివర్ణించారు. బీహార్ ప్రీ పోల్స్ బీజేపీవైపే మొగ్గు చూపిస్తున్నా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని మహాగఠ్ బంధన్ ని కూడా తక్కువ అంచనా వేయలేం. సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదన్ ని మహాగఠ్ బంధన్ ప్రకటించడంతో బీహార్ రాజకీయం రసవత్తరంగా మారింది.
జూబ్లీహిల్స్ సంగతేంటి?
తెలంగాణలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉంది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా ఇక్కడ బీజేపీ తరపున టీడీపీ నేతలు ప్రచారం చేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. బీహార్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తామంటున్న ఏపీ సీఎం చంద్రబాబు పొరుగు రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికల్లో కూడా బీజేపీని బలపరుస్తారా అనేది తెలియాలి. గతంలో టీడీపీ తరపున గెలిచిన మాగంటి గోపీనాథ్ పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్ లో చేరారు. తిరిగి బీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి గెలిచారు. తాజాగా కాంగ్రెస్ హవాని తట్టుకుని మరీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఆ స్థానంలో ఇంకెవర్నీ పోటీ పెట్టడానికి సాహసించని బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు టికెట్ ఇచ్చింది. ఇక్కడ మాగంటి ఫ్యామిలీకి టీడీపీ కార్యకర్తల బలం కూడా ఉంది. టీడీపీ పోటీలో లేదు కాబట్టి వారంతా ఇన్నాళ్లూ మాగంటి కుటుంబంతోనే ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి. ప్రస్తుతానికి అధికార కాంగ్రెస్ కి అక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దశలో టీడీపీ సపోర్ట్ ని బీజేపీ అడుగుతుందో లేదో వేచి చూడాలి. చంద్రబాబు కూడా బీహార్ ఎన్నికల ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై మాత్రం సైలెంట్ గానే ఉన్నారు.
PTI SHORTS | ‘One government, one citizen’ is our motto, says Andhra CM (@ncbn) in Dubai
WATCH: https://t.co/vfCrq2EfSz
Subscribe to PTI's YouTube channel for in-depth reports, exclusive interviews, and special visual stories that take you beyond the headlines. #PTIVideos…
— Press Trust of India (@PTI_News) October 25, 2025
డబుల్ ఇంజిన్ సర్కార్..
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల సాధికారతే లక్ష్యంగా సంస్కరణలు తీసుకువస్తోందని చెప్పారు చంద్రబాబు. ఏపీలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చి ప్రజల తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుందన్నారు. జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రభుత్వం నష్టపోయినా ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. వ్యాపార వేత్తలు, MSME రంగంతోపాటు, ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారని చెప్పారు. తన దుబాయ్ పర్యటన విజయవంతం అయిందని, రాష్ట్రంలో పెట్టుబడులు పెంచేందుకు పలువురు వ్యాపారవేత్తలను ఆహ్వానించినట్టు చెప్పారు. నవంబర్ లో విశాఖపట్నంలో జరిగే సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొనాలని దుబాయ్ వ్యాపారవేత్తలను ఆహ్వానించినట్టు తెలిపారు. నవంబర్ లో ఆర్సెలార్‌మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయబోతున్నట్టు తెలిపారు.