AP Cyclone Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వాయుగుండం ప్రస్తుతానికి అండమాన్ నికోబార్ పోర్ట్ బ్లెయిర్ కు 420 కి.మీ, విశాఖపట్నానికి 990 కి.మీ, చెన్నైకి 990 కి.మీ, కాకినాడకి 1000 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని తెలిపింది. 24 గంటల్లో బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఈ నెల 27 ఉదయానికి తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది.
తుపాను ప్రభావం కోస్తాంధ్రపై ఎక్కువగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నైరుతి-పశ్చిమ బంగాళాఖాతం మధ్య తుపాను తీరం దాటే సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొంది.
వాయుగుండం ప్రభావంతో శనివారం కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read: AP Heavy Rains: ఏపీకి తుపాను ముప్పు.. రానున్న నాలుగు రోజులు అత్యంత భారీ వర్షాలు
కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, కాకినాడ, పశ్చిమగోదావరి, కోనసీమ, కృష్ణా, పల్నాడు, అన్నమయ్య, కడప, చిత్తూరు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం, నంద్యాల, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.