Chiranjeevi: ఇటీవల కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీల ప్రమేయం లేకుండా వారి ఫోటోలను, వారి వాయిస్ ఉపయోగిస్తూ ఎంతోమంది వాణిజ్య ప్రకటనలను ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా సెలబ్రిటీల ఫోటోలను ఉపయోగించడం వల్ల ఇది వారి గౌరవాన్ని దెబ్బతీస్తున్న నేపథ్యంలో ఎంతో మంది సెలబ్రిటీలు కోర్టులను ఆశ్రయిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సైతం ఈ విషయంలో కోర్టును ఆశ్రయించడంతో ఈయనకు తెలంగాణ సివిల్ కోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చింది.
ఈ సందర్భంగా తెలంగాణ కోర్టు ఈ విషయంలో స్పందిస్తూ చిరంజీవి ప్రమేయం లేకుండా ఆయనకు సంబంధించిన ఫోటోలు ఆయన పేరు లేదా ఆయన వాయిస్, అలాగే ఏ ఐ సంబంధిత ఫోటోలు, వీడియోలు కనుక ఉపయోగిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయని వెల్లడించారు. చిరంజీవికి సంబంధించిన మెగాస్టార్, చిరు, అన్నయ్య వంటి పదాలను కూడా ఉపయోగించకూడదని కోర్టు తన ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొన్నారు. చిరంజీవి అనుమతి లేకుండా తన ఫోటోలు పేరును ఉపయోగించడం వల్ల చిరంజీవి పేరు ప్రఖ్యాతలను అతని ప్రతిష్టను దెబ్బతీసినట్లేనని కోర్టు వెల్లడించింది అయితే కోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే వ్యవహరిస్తారో వారిపై చర్యలు కూడా తీసుకోబడతాయని తెలిపారు.
చిరంజీవి దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చిరంజీవి పేరును తమ టిఆర్పి రేటింగ్స్ కోసం వాడితే చర్యలు తీసుకోవాలని ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడిన 30 మందికి కోర్టు నోటీసులను జారీ చేస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 27వ తేదీకి వాయిదా వేసింది. అయితే చిరంజీవి అక్టోబర్ 11వ తేదీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ను కలిసి కోర్టు ఉత్తర్వుల ప్రతిని స్వయంగా అందజేశారు. ఇక ఈ విషయంలో చిరంజీవికి అనుకూలంగా తీర్పు రావడంతో ఇందుకు కృషి చేసిన అడ్వకేట్లకు కూడా చిరంజీవి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన లీగల్ టీం ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు.
వరుస సినిమాలతో బిజీగా చిరంజీవి..
ఇకపోతే ఇటీవల కాలంలో ఇదే విషయం గురించి ఎంతోమంది సెలబ్రిటీలు కోర్టును ఆశ్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీల అనుమతి లేకుండా వారి పేరు ప్రఖ్యాతలను, ప్రతిష్టలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న నేపథ్యంలో సెలబ్రిటీలు కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇక చిరంజీవి కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు ఇప్పటికే విశ్వంభర సినిమా పనులను పూర్తి చేసిన చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.
Also Read: Rashmika: పెళ్లి చేసుకుంటే చస్తాం.. రష్మికను బెదిరిస్తున్న ఫ్యాన్స్.. క్రష్మీగానే ఉండాలంటూ!