తాజాగా కర్నూలులో ఘోర బస్సు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏకంగా 19 మంది సజీవదహనం అయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సంతోషంగా దీపావళి పండుగను జరుపుకుని, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా పలువురి జీవితాలు అత్యంత విషాదకరంగా ముగిసిపోయాయి. ఈ ప్రమాదం తర్వాత చాలా మంది బస్సులో వెళ్లాలంటేనే భయపడుతున్నారు. అదే సమయంలో హైదరాబాద్- బెంగళూరు మధ్య రాకపోకలు కొనసాగించే ప్రయాణీకులు సురక్షితమైన ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నిస్తున్నారు. కొంత మంది రైలు ప్రయాణం పట్ల మొగ్గు చూపితే, ఇంకొంత మంది విమానా ప్రయాణం చేయాలనుకుంటున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్- బెంగళూరు నడుమ 28 రైళ్లు రైలు సర్వీసులు నడుస్తున్నాయి. వేర్వేలు రోజుల్లో, వేర్వేరు సమయాల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే, ప్రస్తుతం ఉన్న రైలు సేవలు సరిపోవని, ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాలను ఇష్టపడేవారికి, జాబ్ కోసం ఉదయాన్నే బెంగళూరు చేరుకోవాల్సిన వారికి ఈ రైళ్లు అనుగుణంగా లేవంటున్నారు ప్రయాణీకులు. ఉద్యోగస్తులు, రోజువారీ ప్రయాణాలకు అనుగుణంగా ఉండాలని కోరుతున్నారు. “బెంగళూరు- హైదరాబాద్ ముఖ్య నగరాలు అయినా, రైల్వే కనెక్టివిటీ అనుకున్నంత స్థాయిలో లేదు” అంటున్నారు కె.ఆర్. పురం నుండి నిత్యం ప్రయాణించే ప్రశాంత్ ప్రభు. “రెండు నగరాల మధ్య రోజూ నడిచే రైళ్లను అందుబాటులో ఉంచాలి. కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లాంటి నైట్ రైలును అనవసరంగా దారి మళ్లించారు. ప్రయాణాన్ని దాదాపు 19 గంటలకు పొడిగించారు. ప్రస్తుతం, బెంగళూరు- హైదరాబాద్ మధ్య రెండు రాత్రిపూట రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. వాటిలో ఒకటి యలహంకకు కుదించబడింది” అని ప్రభు చెప్పుకొచ్చాడు.
ఇక యశ్వంత్ పూర్- కాచిగూడ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను శుక్రవారం నాడు తాత్కాలికంగా నిలిపివేయడం వల్ల తరచుగా ప్రయాణించే వారికి, ముఖ్యంగా వీకెండ్ పని మీద, వ్యక్తిగత ప్రయాణాల కోసంవెళ్లే వారిలో ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణీకుల డిమాండ్ మేరకు రైల్వే తర్వాత ఈ సర్వీసును పునరుద్ధరించింది. ఈ నిర్ణయం పట్ల ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేశారు.
బెంగళూరు- హైదరాబాద్ మధ్య రోజూ పలు విమానాలు నడుస్తున్నాయి. విమాన ప్రయాణ సమయం గంటన్నర అయినప్పటికీ, బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణించే సమయంతో సహా మొత్తం ప్రయాణ సమయం మూడు గంటలకు పైగా పడుతుంది. “విమాన ప్రయాణం తక్కువే అయినా, విమానాశ్రయానికి వెళ్లి, వచ్చేందుకు పట్టే సమయం చాలా ఎక్కువ. బెంగళూరు విమానాశ్రయానికి చేరుకోవడానికి దాదాపు రెండు గంటలు పడుతుంది. అదే సమయంలో మరింత ఖరీదైనదిగా ఉంటుంది. రైళ్లు మరింత సౌకర్యవంతంగా, సరసమైనవిగా ఉంటాయి. KSRTC AC స్లీపర్ కోచ్‌లు కూడా మెరుగైన నైట్ జర్నీని దిసతున్నాయి. తొమ్మిది గంటల ప్రయాణానికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి” అని పలువురు వెల్లడించారు. వీలైనంత వరకు రైళ్లను అందుబాటులోకి తీసుకురావడం మంచిదంటున్నారు.
Read Also: నల్ల రంగులో వందే భారత్.. బీజేపీ మంత్రి ట్వీట్ చూసి అంతా షాక్, అసలు విషయం ఏమిటంటే?