Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ అభ్యర్థిపై వారి సొంత పత్రికల్లో ప్రచురణల రూపంలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇది ఎన్నికల నిబంధనల ఉల్లంఘనే అంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఈఆర్‌ఓ)కి ఫిర్యాదు చేసింది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ మేరకు జూబ్లీహిల్స్ రిటర్నింగ్ అధికారి కర్ణన్‌కు ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి తరఫున వారికి సంబంధించిన సొంత మీడియా సంస్థల్లో.. ప్రత్యేకించి పత్రికల్లో ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా ప్రచారం నిర్వహించడం ఎన్నికల నియమావళిని అతిక్రమించడమేనని కాంగ్రెస్ ఆరోపించింది.
ALSO READ: Ysrcp Google: జగన్ వ్యాఖ్యలతో ఇరుకునపడ్డ గుడివాడ.. గూగుల్ ఎపిసోడ్ తో వైసీపీకి భారీ డ్యామేజ్
ఈ ప్రచార కథనాలు ‘మీడియా సర్టిఫికేషన్ పర్యవేక్షణ కమిటీ (MCMC)’ కళ్లకు గంతలు కట్టి వారి పరిశీలన పరిధిలోకి రాకుండా పరోక్షంగా ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ తెలిపింది. ఇది ప్రజాప్రాతినిధ్య చట్టం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. డబ్బు చెల్లించి ప్రచురించిన వార్తలను సాధారణ కథనాలుగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది.
ALSO READ: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. నవీన్ యాదవ్ గెలుపు శాతమెంత..?
ఇటువంటి నిబంధనల ఉల్లంఘనలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని.. ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కోరింది. ఈ ఫిర్యాదుపై ఎన్నికల అధికారి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.