Chevella road accident: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి చేవెళ్ల పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో 15 మంది గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. వీరిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయని.. మిగతా వారు రెండు మూడు రోజుల్లో కోలుకుంటారని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది..? తప్పు ఎవరిది..? అనే విషయాల గురించి బాధితులు తెలిపారు.
బాధితుడు శ్రీనివాస్ (సేల్స్ మెన్) మాట్లాడుతూ.. ‘నేను హైదరాబాద్‌లో సేల్స్ మెన్ గా పని చేస్తాను. వీక్ ఆఫ్ కావడంతో ఇంటికి వచ్చాను. రెగ్యులర్ గా ట్రైన్ కి హైదరాబాద్ వెళ్తాను. ఈ రోజు ట్రైన్ మిస్ అవ్వడంతో బస్సుకు వెళ్లాను. క్షణాల్లోనే ప్రమాదం జరిగింది. కంకర పూర్తిగా మా మీద పడిపోయింది. నా కళ్లముందే ఐదుగురు చనిపోయారు. నేను కంకర్ లో పూర్తిగా కూరుకుపోయాను. దాదాపు 20 నిమిషాల తర్వాత నన్ను బయటికి తీశారు’ అని కన్నీటి పర్యంతమయ్యారు.
మరో విద్యార్థిని మాట్లాడుతూ.. ‘నేను ధరూర్ లో బస్సు ఎక్కాను. బస్సులో నిల్చుని ఉన్నాను. ప్రమాదం జరిగిన వెంటనే నేను కళ్లు తిరిగి పడిపోయాను. బస్సులో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. స్పాట్లో చాలా మంది చనిపోయారు. తెల్లవారుజాము కావడంతో చీకటిగా ఉంది. ఏం జరిగిందో మాకు అర్థం కాలేదు. కంకర మొత్తం మీద పడిపోవడంతో మేము కదలలేని పరిస్థితి నెలకొంది’ అని చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది.
ALSO READ: Road Accident: బాపట్లలో ఘోరం.. లారీ–కారు ఢీ.. ఆరుగురు స్పాట్!
మరో బాధితురాలు నాగమణి (ప్రెస్ క్లబ్‌లో పనిచేస్తున్న మహిళ) మాట్లాడుతూ.. ‘ప్రతిరోజు నేను ఇదే బస్సులో ప్రయాణం చేస్తుంటాను. నేను డ్రైవర్ పక్కన ఇంజన్ పై కూర్చున్నాను. బస్సు డ్రైవర్ తప్పు ఏమి లేదు. టిప్పర్ డ్రైవర్ దే తప్పు. ప్రమాదం జరగగానే కిటికీలపై అద్దాల పై నుండి కంకర నాపై పడిపోయింది. నేను కంకర్ లో పూర్తిగా మునిగిపోయాను. చేతులు పైకి పెడుతూ కాపాడమంటూ గట్టిగా అరిచాను. కంకర్ లో మునిగిపోయిన నన్ను స్థానికులు గమనించి బయటికి తీశారు’ అని ప్రమాదం జరిగిన తీరును వివరించారు.
కంకర లోడుతో అతి వేగంగా వచ్చిన టిప్పర్ లారీ అదుపు తప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని తెలుస్తోంది. లారీలో ఉన్న కంకర మొత్తం బస్సుపై పడటంతోనే ఎక్కువ మంది ప్రయాణికులు దాని కింద కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.