Pawan Kalyan: శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం తొక్కిసలాట ఘటనలో 9 మంది భక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఈ మేరకు అధికారులకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
పవిత్ర కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో, కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భక్తులకు పటిష్టమైన భద్రత, అత్యుత్తమ సౌకర్యాలు కల్పించడంపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సోమవారం ఆయన కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి, ఏర్పాట్లపై పలు కీలక సూచనలు చేశారు.
జిల్లాలోని ప్రముఖ క్షేత్రాలైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి, పిఠాపురం పాదగయ, పంచారామం సామర్లకోట కుమార భీమేశ్వరస్వామి ఆలయాలకు కార్తీక మాసంలో భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. “కాశీబుగ్గ ఘటన నేపథ్యంలో దేవాదాయ శాఖ ఆలయాల దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.” అని ఆయన ప్రత్యేకంగా సూచించారు. ప్రసిద్ధ క్షేత్రాలతో పాటు, ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల నిర్వహణలో ఉన్న ఆలయాల నివేదికను కూడా సిద్ధం చేసి, అక్కడ రద్దీని పర్యవేక్షించాలని సూచించారు.
Read Also: Super Star Krishna: షాకింగ్.. సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం తొలగింపు
నవంబర్ 5న కార్తీక పౌర్ణమి ఉన్నందున, అలాగే శని, ఆది, సోమవారాల్లో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని, అందుకు తగినట్లుగా సిద్ధంగా ఉండాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లను నిర్వహించాలని, ఆలయ ప్రాంగణాలు, పరిసరాల్లో సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తుల రద్దీకి తగిన విధంగా తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుధ్య నిర్వహణను స్థానిక సంస్థలు చేపట్టాలన్నారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని, జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించి ప్రమాదాలకు తావులేకుండా చూడాలన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ఆలయాల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దేవాదాయ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు.