Pulicat Lake: నెల్లూరు జిల్లా పరిధిలోని పులికాట్ సరస్సుకు శీతాకాలం అతిథుల రాక మొదలైంది. వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తున్న సైబీరియన్ పక్షులు, ఫ్లెమింగోలు మనందరికీ కనువిందు చేయడానికి సిద్ధమయ్యాయి. ఆహారం, విశ్రాంతి నిమిత్తం ఆరు నెలల పాటు పులికాట్ పరిసరాల్లో ఈ పక్షులు నివసిస్తాయి. అందుకే ప్రతి ఏటా ఈ నీటి పక్షుల రాకను ‘ఫ్లెమింగో ఫెస్టివల్’ పేరిట ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. మూడు రోజుల పండుగకు రాష్ట్రం నలుమూలల నుంచి ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది పక్షి ప్రేమికులు వస్తుంటారు.
‘మనమంతా ముద్దుగా రాజహంస అని పిలుచుకునే ఫ్లెమింగోలు జీవ వైవిధ్యానికి ప్రతీకలుగా నిలుస్తాయి. అక్టోబర్ మాసంలో వచ్చి మార్చిలో తిరిగి వెళ్లిపోయే ఈ విదేశీ అతిథులు… మన ఆతిథ్యం నచ్చిందో ఏమో ఈ మధ్య ఏడాది పొడుగునా కనువిందు చేస్తున్నాయి. ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా ఫ్లెమింగోలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా అటవీ శాఖ ఆధ్వర్యంలో అనుకూల పరిస్థితులు కల్పిస్తున్నాం. ఫ్లెమింగోల ఆహారం, విశ్రాంతి, భద్రతకు ఇబ్బందులు కలగకుండా గత కొంత కాలంగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఈసారి మూడు రోజుల పండుగతో సరిపెట్టకుండా ఎకో టూరిజాన్ని విస్తరించే ప్రక్రియలో భాగంగా ఫోటోగ్రఫీ, బర్డ్ సీయింగ్, ఎకో క్లబ్ పేరిట వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం’ – డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Also Read: Kurnool News: పోలీసుల ముందుకు వైసీపీ శ్యామల.. విచారించిన పోలీసులు, తప్పుడు ప్రచారం చేసినందుకు
మొంథా తుపానుకు ముందు నుంచే ఫ్లెమింగోల రాక మొదలయ్యిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. పెను గాలులు, భారీ వర్షాలకు వాటి స్థావరాలకు ఇబ్బంది కలగకుండా అటవీ శాఖ ఆధ్వర్యంలో తగు చర్యలు చేపట్టామన్నారు. రానున్న మూడు నెలలు ఫ్లెమింగోల రక్షణపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని అటవీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. పులికాట్ ను ఫ్లెమింగోల శాశ్వత నివాస స్థావరంగా మార్చేందుకు అనుకూలమైన పరిస్థితులు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజానికి గమ్యస్థానంగా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు.